గేదె దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతుడిని 48 ఏళ్ల నీరగంటి జయన్నగా పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణమైన గేదెను నిర్భందించారు గ్రామస్థులు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గేదెను అరెస్ట్ చేశారు పోలీసులు.
పోలీసుల వివరాల ప్రకారం.. చన్నగిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్ బసవనహళ్లి గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బసవనహళ్లి గ్రామానికి పక్కనే ఉన్న లింగడహళ్లి గ్రామస్థులు.. ఈ గేదెను ఉడుసలంబ దేవికి సమర్పించుకున్నారు. అయితే, ఈ గేదె తరచుగా బసవనహళ్లి గ్రామానికి వచ్చి.. మిగతా పశువులతో గొడవ పడుతుండేది. మృతుడు జయన్నకు కూడా కొన్ని గేదేలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే జయన్నపై మూడునాలుగు సార్లు ఈ గేదే దాడి యత్నించింది. కానీ అతడు చాకచక్యంగా దాని నుంచి తప్పించుకున్నాడు.
కాగా, ఆదివారం మరోసారి జయన్నపై ఈ గేదె దాడి చేసింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు గేదెను బంధించారు. మృతుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుడి కొడుకు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గేదెను అదుపులోకి తీసుకున్నారు.
పలుమార్లు గేదె దాడి..
అంతకుముందే 7 నుంచి 8 మందిపై గేదె దాడి చేసిందని గ్రామస్థులు తెలిపారు. దీనిపై ఆలయ కమిటీకి.. గ్రామ పంచాయతీ నోటీసు సైతం జారీ చేసిందన్నారు. కానీ ఆలయ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వెల్లడించారు.ఆలయ కమిటీ నిర్లక్ష్యం కారణంగానే జయన్న చనిపోయాడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"మూడు సంవత్సరాల నుంచి ఈ గేదె గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. చెట్లను పీకేస్తోంది. మనుషులపై దాడి చేస్తోంది. జయన్న తన పశువుల గుంపులో ఈ గేదెను చేరనిచ్చేవాడు కాదు. దీంతో ఆ గేదెను జయన్నపై దాడి చేసి.. చంపేసింది. ఆదివారం సాయంత్రం జయన్న తన పశువులను ఇంటికి తోలుకుపోయే.. సమయంలో గేదె దాడి చేసింది" అని గ్రామస్థుడు లోకేశ్ తెలిపాడు. జంతువులపై చర్యలు తీసుకునేందుకు ఎటువంటి చట్టాలు లేవని పోలీసులు తెలిపినట్లు లోకేశ్ వెల్లడించాడు.
గేదెను బంధించిన గ్రామస్థులు..
పోలీసుల ఆధ్వర్యంలోనే గేదెను పట్టుకుని బంధించామని మరో గ్రామస్థుడు తెలిపాడు. జయన్న కుటుంబానికి న్యాయం చేయాలని అతడు డిమాండ్ చేశాడు. దీనిపై ఆలయ కమటీ వివరణ ఇవ్వాలన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి గెదేను బంధించామని.. దాన్ని వేరే ప్రదేశంలో విడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తామని వారు వెల్లడించారు. అయితే జంతువులపై చట్ట ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని పోలీసులు తెలిపారు.