బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి ఘటనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈసీ పరిశీలకులు నివేదిక అందజేశారు. దీదీపై ఎలాంటి దాడి జరగలేదని, ఆ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేనని అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీ చుట్టూ భారీగా సెక్యూరిటీ ఉందని తెలిపారు. దీంతో ఆమె కాన్వాయ్‌పై దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు తమ నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఘటనపై ప్రత్యేక పోలీస్ పరిశీలకుడు వివేక్ దుబే, ప్రత్యేక పరిశీలకుడు అజయ్ నాయక్‌లను కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది. దీంతో వారు నందిగ్రామ్‌లోని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం సవివరమైన నివేదికను ఈసీకి అందజేశారు.
ఈ నెల 10న నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది. అందులో వివరాలు నామమాత్రంగానే ఉన్నాయని.. పూర్తి వివరాలతో మరో నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఈ నెల 10న నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన అనంతరం ఓ ఆలయాన్ని సందర్శించిన సమయంలో బుధవారం దీదీ కాలికి గాయమైన ఘటన బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. సీఎంపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు తృణమూల్ ఆరోపణలను భాజపా ఖండించింది. మమతపై ఎలాంటి దాడి జరగలేదని, అది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందేనంటూ కొట్టిపారేసింది. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే దీదీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఈ ఘటనపై ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. ఘటనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. మరోవైపు కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందిన దీదీ శుక్రవారం డిశ్చార్జి అయ్యారు.
ఇదీ చూడండి: దీదీకి గాయం.. కాంగ్రెస్ విమర్శ- ఖండించిన కేజ్రీ