బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య వివాదం తీవ్రమవుతోంది. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలంటే ప్రస్తుత గవర్నర్‌ను మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు మమత. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి గవర్నర్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, హింసను పెంచి చూపిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
'' ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర శాంతిభద్రతల సమస్యను లేవనెత్తి గవర్నర్ హద్దులు మీరారు. సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై ప్రశ్నించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తాము చూస్తుంటే.. గవర్నర్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నం చేస్తున్నారు.''
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని, కరోనా కట్టడిలో అధికార యంత్రాంగం నిమగ్నం అయ్యిందని తెలిపారు.
తోసిపుచ్చిన రాజ్‌భవన్
తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణల్ని రాజ్‌భవన్ వర్గాలు ఖండించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడే గవర్నర్ ప్రశ్నించారని తెలిపాయి. నారదా కుంభకోణంలో భాగస్వాములైన వారిపై సీబీఐ విచారణకు మార్గం సుగమం చేశారని పేర్కొన్నాయి.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటినుంచి మమత ప్రభుత్వంపై మాటల దాడి పెంచారు ధన్కర్. పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు జరిగిన సీతల్ కుచి, నందిగ్రామ్ ప్రాంతాల్లోనూ పర్యటించి దీదీ సర్కార్‌ను ప్రశ్నించారు. అంతకుముందు కూడా మమత, ధన్కర్ మధ్య మాటల యుద్ధాలు జరిగాయి.
నారదా కుంభకోణం కేసులో.. ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మేల్యే సహా మాజీ మంత్రిని సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో.. మమత లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి: 'హింసాత్మక ఘటనలతో బంగాల్ ప్రజలు సతమతం'