మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావంతో కొంకణ్ తీర ప్రాంతంలోని రోడ్లు పూర్తిగా జలదిగ్భందమయ్యాయి. రాయ్‌గఢ్‌లో వరదల కారణంగా ఐదుగురు మృతిచెందారు. 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వర్షపు నీరు చేరటం వల్ల కొల్హాపుర్‌లోని పంచ్‌గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తీర ప్రాంతంలోని 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
కొండ చరియలు విరిగిపడి...
రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్ తలై గ్రామంలో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. సుమారు 300 మంది చిక్కుకున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. రోడ్లు జలమయం కావటంవల్ల ఘటనా స్థలానికి చేరుకోవటం సమస్యగా మారిందని రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఉదయం అక్కడకు చేరుకున్న అధికారులు... 30 మంది చిక్కుకున్నారని, వారిలో 15 మందిని రక్షించామని చెప్పారు.
అంతకుముందు.. గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ప్రధాని ఫోన్..
మహారాష్ట్రలో భారీ వర్షాల దృష్ట్యా.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో సంభాషించారు. పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అన్నివిధాలా సాయం అందుతుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: చరిత్రలో తొలిసారి నీట మునిగిన జ్యోతిర్లింగం