భాజపాపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయని ఆరోపించారు. ఈ సంస్థల ద్వారా తమ కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకోవడాన్ని పరిశీలిస్తే విపక్ష పార్టీ కక్షసాధింపు రాజకీయాలు అవగతమవుతాయని భాజపాను ఉద్దేశించి దుయ్యబట్టారు.
మహారాష్ట్రలో తమ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఉద్ధవ్ ఠాక్రే. పత్రిక సంపాదకుడు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో పలు విషయాలపై చర్చించారు.
హెచ్చరికలు!
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పరిణామాలను శివసేన గమనిస్తూనే ఉందని పేర్కొన్నారు ఠాక్రే. 'తమ కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకోవాలని అనుకునేవారు... వారికీ కుటుంబాలు, పిల్లలు ఉన్న విషయాన్ని మర్చిపోరాదని' హెచ్చరించారు. చేతులు కడుక్కోమని చెప్పడం మినహా కరోనా విషయంలో సీఎం చేసిందేమీ లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. 'ప్రస్తుతం చేతులు కడుక్కోమనే చెబుతున్నాం.. ఇలాంటి విమర్శలు కొనసాగితే మీ వెంట పడతాం' అని ఘాటుగా బదులిచ్చారు.
"కక్షసాధింపు రాజకీయాల జోలికి మా పార్టీ వెళ్లాలనుకోవడం లేదు. కానీ మీరు(విపక్షాలు) బలవంతం చేస్తే మీపై సుదర్శన చక్రం ప్రయోగిస్తాం."
-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
సీఎంగా సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఠాక్రే. ప్రభుత్వ ఏర్పాటులో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మూడు పార్టీలకు చెందిన సభ్యులు మద్దతు ఇవ్వడం వల్లే తాను పనిచేయగలుగుతున్నానని చెప్పారు.
ఇదీ చదవండి- ఇన్-స్పేస్ ఛైర్మన్ పదవికి ముగ్గురు శాస్త్రవేత్తల పేర్లు