మహారాష్ట్రలో కరోనాను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే బుధవారం పేర్కొన్నారు. ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు ముఖ్యమని, ఇందుకోసం నిబంధనలను పకడ్బందీగా అమలు చేయవలసి వస్తుందని అన్నారు.
"ప్రభుత్వానికి లాక్డౌన్ విధించాలని లేకపోయినా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో కఠిన ఆంక్షలను అమలు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రజలు సిద్ధంగా ఉండాలి."
-రాజేశ్ తోపే, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి
పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండదు..
లాక్‌డౌన్‌పై అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఉండదని సంబంధిత అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. దాని స్థానంలో జిల్లాల వారీగా కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. అలాగే ఎక్కడికక్కడే కొవిడ్‌ను కట్టడి చేసేందుకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రేపు, ఎల్లుండికల్లా కొవిడ్ ఆంక్షలకు సంబంధించి నిర్దేశిత ప్రమాణాల(ఎస్‌ఓపీ)లపై తాజా ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు.
జిల్లాల వారీగా కంటైన్మెంట్ జోన్లు, స్థానికంగా ఆంక్షల విధింపుపైనే ప్రధానంగా దృష్టిసారించామని మరో ప్రభుత్వ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, థియేటర్లను పూర్తిగా మూసివేయకపోవచ్చు కానీ, మరిన్ని నిబంధనలు విధించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల అనవసర కదలికలను అవి కట్టడి చేసే అవకాశం ఉందన్నారు.
బంగాల్లో సెకండ్ వేవ్!
బంగాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు కోల్‌కతా వైద్యులు. కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీలు, సభల్లో పాల్గొనడమే ఇందుకు కారణమని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే గతేడాదిలాగే మహమ్మారి మరోసారి విజృంభిస్తుందని అభిప్రాయపడ్డారు. 'మహమ్మారి వ్యాప్తిలో రెండో దశ, మూడో దశ రావడం సహజం. అలాగని ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదు. దాని వల్ల మరింత నష్టం జరుగుతుంది' అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి : చిరుత మాంసం తిన్న నలుగురు అరెస్టు