భగవంతుడు శ్రీకృష్ణుడిని తలచుకోగానే మదిలో మెదిలేది ఆయన వేణుగానమే. ఆ పిల్లనగ్రోవినే చిన్నచిన్న మార్పులతో ఇప్పటికీ సంగీత వాద్యంగా వినియోగిస్తున్నారు. అయితే... ఏ ఫ్లూట్ అయినా నోటితో గాలి ఊది సంగీతాన్ని పలికిస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన ఓ వ్యక్తి తయారుచేసే ఫ్లూట్ మాత్రం.. గాలిలో వేలాడుతూ వినసొంపైన సంగీతం పలికిస్తుంది.
పాండీరామ్ కుమారుడు వీరేంద్ర ప్రతాప్ మాండవి. తన తాత, తండ్రి ఈ పిల్లనగ్రోవి తయారుచేస్తుంటే చిన్నప్పటినుంచీ చూస్తూ పెరిగాడు. మొదట్లో స్వయంగా వినియోగించుకునేందుకు తయారు చేసుకున్నాడు ఆయన తండ్రి. రాత్రిపూట పాములు, ఇతర జంతువులు దగ్గరికి రాకుండా సంగీతం వాయించేవాడట. క్రమంగా చుట్టుపక్కల వారికీ ఆ శబ్దం నచ్చింది.
ఫ్లూట్ తయారీ విధానం..
ముందుగా ఎండిన వెదురు బొంగులు సేకరించాలి. వాటి లోపల బొటన వేలి మందంతో కన్నం ఉండేలా చేయాలి. రెండు అడుగుల పొడవు బొంగును కత్తిరించాలి. వాటిలోంచి గాలి సరిగా వెళ్తుందో లేదో చూసుకోవాలి. తర్వాత పైభాగాన్ని నున్నగా చేసి, డిజైన్లు చెక్కాలి. తర్వాత వాషర్లలో వేసి, వివిధ రకాల కత్తులతో డిజైన్లు వేయాలి. రెండు మూడు గంటల్లో ఫ్లూట్ తయారైపోతుంది. ఈ వినూత్న వేణువు తయారీ, విక్రయ కేంద్రాలు ప్రధానంగా బస్తర్, అబుజ్‌మర్‌లోనే ఉన్నా.. వాటి ప్రత్యేకత మాత్రం దేశవిదేశాల్లోనూ ప్రత్యేకత సంపాదించిపెట్టింది.
"ప్రజలు ఉల్లాసంగా దీన్ని వాయిస్తారు. మాకూ కావాలని కొనుక్కెళ్తారు. దిల్లీకి తీసుకువెళ్లినపుడు బడిపిల్లలు ముచ్చటపడి ఈ ఫ్లూట్ కొనుక్కున్నారు. 1991లో ఇటలీకి వెళ్లాను. అక్కడి ప్రజలూ కొనుక్కుని, నన్నెంతో మెచ్చుకున్నారు."
-పాండీరామ్ మాండవి
గిట్టుబాట ధర లేక..
వివిధ డిజైన్లలో లభ్యమవుతున్న ఈ ఫ్లూట్.. తయారీదారులకు మాత్రం గిట్టుబాటు ధర అందించలేకపోతోంది. ఒక్కో పిల్లనగ్రోవి ధర 100 నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది. మొదట్లో పాండీరామ్ ఈ వాద్యపరికరంపై ఎలాంటి డిజైన్లు చెక్కేవాడు కాదు. ప్రస్తుతం వెదురు బొంగులపై కంటికింపైన డిజైన్లతో రూపొందిస్తున్నాడు. విదేశాల్లో ఒక్కో ఫ్లూట్ 1000 రూపాయలకు అమ్ముడవుతోంది. దిల్లీకి చెందిన ఓ సంస్థ.. 2 వేల పరికరాలను కొనుగోలు చేసింది.
"కళ మనిషికి గౌరవం తెచ్చిపెడుతుంది. అందుకే కళను బతికించుకోవాలి. ఇంకెవరూ నేర్చుకోకపోతే నాతోనే అంతరించిపోతుంది. అందుకే నేటితరం నేర్చుకోవాలి. శిక్షణ కేంద్రం తెరిచి, ఔత్సాహికులను నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుంది. ఈ కళను బతికించాలంటే మరింత మంది నేర్చుకోవాల్సిన అవసరముంది."
-పాండీరామ్ మాండవి
ఇదీ చదవండి: బావిలో పడ్డ శునకాన్ని రక్షించిన 'సాహస' మహిళ