Madhapur Drugs Case Update : హైదరాబాద్‌లో మరో మారు డ్రగ్స్ లింకులు బయటకు వచ్చాయి. నిందితుల్లో ఒకరు మాజీ నేవీ అధికారి, మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొకరు సినీ పరిశ్రమకు ఫైనాన్స్ చేస్తున్న వారు ఉన్నారు. మొత్తం ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బాలాజీ మాజీ నేవీ అధికారిగా గుర్తించిన పోలీసులు.. కొన్నేళ్ల క్రితం కన్నుకు గాయం కావడం వల్ల నేవీ నుంచి వైదొలిగినట్లు తెలిపారు.
తరచూ స్నేహితులతో హైదరాబాద్‌లో పార్టీలు నిర్వహించే బాలాజీ.. మాదాపూర్‌లోని ఫ్రెష్‌లింగ్ అపార్ట్‌మెంట్‌లో మిత్రులతో పార్టీలు (Rave Party in Madhapur) చేసుకుంటున్నాడు. అయితే ఇదే క్రమంలో అతనికి హైదరాబాద్, బెంగళూరులోని మాదకద్రవ్యాల సరఫరాదారులతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన నిందితుడు.. నైజీరియన్లతో సైతం సంబంధాలు కొనసాగించాడు.
శివరాత్రి పూట రేవ్‌పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..
వారి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసిన బాలాజీ.. తెలిసిన, పరిచయం ఉన్న వారికి డ్రగ్స్ విక్రయించాడు. ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించేందుకు సినీ పరిశ్రమలో ఉన్న కొందరికి విక్రయించడం ప్రారంభించాడు. తరచూ బెంగళూరులో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు, విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి బాలాజీ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. ఇదే క్రమంలో నిందితుడికి సినిమాలకు ఫైనాన్స్ (Film Financier Venkataratna Reddy Arrested)చేసే వెంకటరత్నారెడ్డి పరిచయమయ్యాడు.
ఢమరుకం, కిక్, లవ్‌లీ, ఆటోనగర్ సూర్య సినిమాలకు ఫైనాన్స్ చేసిన వెంకటరత్నారెడ్డి.. తరచూ వీఐపీలకు నగర శివారు ప్రాంతాల్లో పార్టీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు భారీ మొత్తంలో డ్రగ్స్ కావాలని అతను.. బాలాజీకి భారీగా డబ్బు ఇచ్చాడు. మరోవైపు వెంకటరత్నారెడ్డి తాను నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు యువతులను సైతం సమకూరుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతనికి.. డ్రగ్స్ పార్టీలు నిర్వహించే గుంటూరుకు చెందిన మురళితో పరిచయాలు ఉన్నాయి.
Madhapur Rave Party Case Updates : మురళి.. ఆర్‌పీఎఫ్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ డ్రగ్స్ దందాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో గుడి మల్కాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాలాజీని పట్టుకున్నారు. గుడి మల్కాపూర్ పోలీసులతో కలిసి సోదాలు చేసిన తెలంగాణా యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి 15 ఎక్స్‌ట్రాపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో మాదాపూర్‌లోని విఠల్‌రావునగర్‌లోని ఫ్రెష్‌లివింగ్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 804లో సోదాలు చేసిన పోలీసులు.. వెంకటరత్నారెడ్డి సహా గుంటూరుకు చెందిన మురళిని అరెస్ట్ చేశారు.
సోదాల సమయంలో వీరితో పాటు ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి వెంకటరత్నారెడ్డి వారిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కాగా ఈ కేసులో నలుగురు సరఫరాదారులు, వీరిలో నైజీరియన్లు, మరో 18 మంది వినియోగదారులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నట్లు వివరించారు. బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళిలను అరెస్ట్ చేసిన టీన్యాబ్ పోలీసులు.. 2.8 గ్రాముల కొకైన్, 6 ఎల్‌ఎస్డీ బోల్ట్స్, 25 ఎక్స్‌ట్రాపిల్స్, 40 గ్రాముల గంజాయి, రూ.72,500 నగదు, 2 కార్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ.32.89 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ అరెస్టులతో వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. నిందితుల చరవాణులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిలో కీలక సమాచారం ఉంటుందని భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పలువురు ప్రముఖుల పేర్లు సైతం బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఫామ్‌హౌస్‌లో సాఫ్ట్వేర్ బర్త్‌డే పార్టీ.. 55 మందిపై కేసు..!