Venkaiah naidu on ed cases enquiry: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా? అంటూ.. ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. పార్లమెంట్ సమావేశాలతో సంబంధం లేకుండా.. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరుకావాలని సూచించారు. చట్టాలను చేసే పౌరులుగా.. అది మన బాధ్యత అని గుర్తుచేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జులై 18న ప్రారంభమైన సమావేశాలు.. ఆగస్టు 12న ముగియనున్నాయి.
"పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా.. లేకపోయినా.. ఎంపీలు దర్యాప్తు సంస్థలు పిలిచే విచారణలకు హాజరుకావాలి. చట్టాలను చేసే పౌరులుగా.. ఆ చట్టాలను, న్యాయ ప్రక్రియను గౌరవించడం మన బాధ్యత."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్
ఇటీవల రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేయడం వల్ల గురువారం సభలో దుమారం చెలరేగింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్తావించారు ఖర్గే. కాంగ్రెస్‌ను భాజపా భయపెట్టాలని చూస్తోందని.. అయితే దీనికి భయపడబోమని అన్నారు.
"ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రం.. దర్యాప్తు సంస్థలను వాడుతోంది. ఈడీ చర్యలపై కేంద్రం సమాధానం చెప్పాలి. నాకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ నుంచి సమన్లు అందాయి. నేను చట్టానికి లోబడి ఉంటాను.. కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాసాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సబబు? మేం భాజపాకు భయపడం. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడతాం."
-మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత
నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న సమయంలోనే ఆ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. పార్లమెంట్ లోపల, బయట జీఎస్టీ, ధరల పెరుగుదలపై నిరసనలు వ్యక్తం చేసింది. మరోవైపు పాత్రాచాల్ కుంభకోణంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఆగస్టు 1 అర్ధరాత్రి అరెస్టు చేసింది ఈడీ. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో బంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసింది.
ఇవీ చదవండి: 'దేశంలో ఆ ఇద్దరి 'నియంత' పాలన.. ప్రశ్నిస్తే దాడులే!'
కాంగ్రెస్ నిరసనల్లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక