భారత స్వాతంత్య్రోద్యమానికి ఓ బ్రిటిష్ వైస్రాయి ఊపిరిలూదాడంటే నమ్మలేం. అలాగే బ్రిటిష్ వారే తమ వైస్రాయిని(Indian viceroy) వ్యతిరేకించారంటే కూడా ఊహించలేం! అలా భారతీయుల అభిమానాన్ని... బ్రిటిషర్ల ఆగ్రహాన్ని చవిచూసిన వైస్రాయ్ లార్డ్ రిప్పన్! 1880-84 దాకా భారత్‌లో పనిచేసిన లార్డ్ రిప్పన్(lord ripon Indian viceroy) చర్యలు- భారతీయుల్లో స్వాతంత్య్రోద్యమకాంక్షను పరోక్షంగా ప్రోత్సహించాయి. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆరంభానికి బీజాలు వేశాయి.
1800 ఆరంభంలో బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన రాబిన్‌సన్ కుమారుడు రిప్పన్! భారత్‌లో పనిచేసిన నాలుగేళ్ళూ అనేక సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల్లో స్వయంపాలన రిప్పన్ పుణ్యమే. అప్పటికే మున్సిపాలిటీలు ఏర్పాటైనా వాటిని ప్రభుత్వ అధికారులే నిర్వహించేవారు. వారి స్థానంలో ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు బాధ్యత ఇచ్చి స్వయం పాలనకు ద్వారాలు తెరిచారు. ఇప్పుడు స్థానిక సంస్థలు నిర్వహిస్తున్న విధులు చాలామేరకు ఆయన నిర్ణయాల పుణ్యమే! అలా స్వయంపాలన రుచి భారతీయులకు మొదలైంది. ఇంగ్లిష్ పత్రికలతో పాటు స్థానిక భాషా పత్రికలకు కూడా స్వేచ్ఛనివ్వటం, ప్రాథమిక విద్యను బలోపేతం చేయటం రిప్పన్ చేసిన మరిన్ని మంచిపనులు! కార్మిక చట్టాన్ని సంస్కరించటం, ఉద్యోగులకు నెలకు కొన్ని సెలవులు, బాలకార్మికుల నిషేధం ఆయన తెచ్చిన సంస్కరణలు!
అలాగే.. న్యాయవ్యవస్థలో కూడా సమానత్వం ఉండాలంటూ... భారతీయ న్యాయమూర్తులకూ యూరోపియన్ జడ్జీలతో సమానంగా అధికారాలు కల్పిస్తూ ఓ చట్టం తేవాలని ప్రతిపాదించారు. దీన్ని ఇల్బర్ట్ బిల్లు అంటారు. న్యాయరంగంలో జాతివివక్షను తొలగించటం దీని ఉద్దేశం. ఇది అమలైతే... యూరోపియన్లను విచారించే అధికారం భారతీయ జడ్జీలకు లభిస్తుంది. దీనిపై యూరోపియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత్‌లోనే కాకుండా... లండన్‌లో కూడా రిప్పన్‌పై బ్రిటిషర్లు ఆగ్రహం వ్యక్తంజేశారు. తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలని ఉద్యమం చేశారు. చివరకు... వారి ఒత్తిడికి తలొగ్గి ఈ చట్టాన్ని నీరుగార్చి ఆమోదించారు. దీంతో మనస్తాపం చెందిన రిప్పన్... పదవీకాలం ముగియటానికి ముందుగానే 1884లో రాజీనామా చేశారు. ఆయన చూపిన స్వయంపాలన బాట భారతీయుల్లో కొత్త ఊపిరిలూదింది. ఆ తర్వాతి ఏడాది 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆరంభమైంది!
ఇదీ చూడండి: Independence day: స్వాతంత్య్ర దినోత్సవం పంద్రాగస్టే ఎందుకంటే?