Lokesh Delhi Tour: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్, విచారణ, తదనంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిల్లీ వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోకేశ్ జతీయ మీడియాతో మాట్లాడనున్నారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా లోకేశ్ ప్రయత్నాలు చేయనున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేశ్ చర్చించనున్నారు. పార్లమెంట్లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలపై చర్చించేలా టీడీపీ వ్యూహంలో భాగంగానే లోకేశ్ దిల్లీ పర్యటనను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌పై లోక్‌సభలో చర్చ కోసం ఆయా పార్టీ ఎంపీలను కలవనున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
అంతకుముందు రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన లోకేశ్.. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది చంద్రబాబు.. సైబర్ టవర్స్ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారు.. అలాంటి వ్యక్తిపై ఆధారాలు లేకుండా.. స్కామ్ జరిగిందని కేసు పెట్టారని లోకేశ్ ఆగ్రహించారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్ వార్ (Civil War) మొదలుపెట్టాలని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జనసేన, టీడీపీ తరఫున కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు లోకేశ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా పోరాడుతామని చెప్పారు. చంద్రబాబు జైలు లోపల ఉన్నా అధికార పక్షానికి చెమటలు పట్టిస్తున్నారు.. బయట ఉన్నా.. లోపల ఉన్నా సింహాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. మీడియా గొంతు నొక్కేందుకు జీవో తీసుకువచ్చారు.. అమరావతి (Amaravati) రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు.. జగన్ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అని లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసేందుకు వచ్చిన అధికారుల కాల్‌డేటా (Call Data) రికార్డులు భద్రపరచాలని కోరాం అని వెల్లడించారు.
జగన్ పాలనలో సామాన్యులకు రక్షణ కొరవడిందని లోకేశ్ (Lokesh) పేర్కొన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, వైసీపీ నాయకులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా స్పందన లేదని అన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న టీడీపీ, జనసేన (Janasena) నాయకులపై కేసులు పెడుతున్నారని, రాష్ట్ర సరిహద్దుల్లో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారని, ప్రభుత్వ అరాచకాలపై పోరాడితే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. 'భీమవరంలో యువగళం పాదయాత్ర శాంతియుతంగా చేశాం.. సైకో పోవాలి-సైకిల్ రావాలి పాటకు వైసీపీ శ్రేణులే డ్యాన్స్ చేశాయి అని చెప్పిన లోకేశ్.. యువగళం (Yuvagalam) పాదయాత్రపై రాళ్ల దాడి చేసి మాపైనే కేసులు పెట్టారని దుయ్యబట్టారు.