పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సోమవారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. పెగాసస్ వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళన నడుమే ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
అంతకుముందు ఆ గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు చేపట్టారు స్పీకర్ ఓం బిర్లా. రోజంతా గందరగోళం కొనసాగింది. ఫలితంగా దిగువసభ మంగళవారానికి వాయిదా పడింది.
పెద్దల సభలోనూ..
రాజ్యసభలోనూ పెగాసస్ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైనప్పటికీ.. ఆందోళనతో సభలో కార్యకలాపాలు కొనసాగించే అవకాశం లేకపోవడం వల్ల మంగళవారానికి వాయిదా పడింది.
అమరవీరులకు నివాళి
ఉభయ సభలు ప్రారంభం కాగానే కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పించారు. దేశాన్ని కాపాడేందుకు సైనికుల చేసిన త్యాగాల్ని కొనియాడాయి. ఈ సందర్భంగా ఎంపీలందరూ కొద్ది క్షణాల పాటు మౌనం పాటించారు.
మీరాబాయికి అభినందనలు
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు పార్లమెంట్ ఉభయ సభలు అభినందనలు తెలిపాయి. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మీరాబాయి ప్రదర్శన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.
ఇదీ చూడండి: లోక్‌సభ సీట్లు త్వరలోనే 1000కి పెంపు- నిజమెంత?