Rajya Sabha Adjourned: లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
Lakhimpur Kheri Case: శుక్రవారం రాజ్యసభ ప్రారంభమైన క్రమంలోనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. లఖింపుర్పై చర్చ చేపట్టాలని, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. ఈ క్రమంలో.. సభను సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ అధ్యక్షుడు పీయూష్ గోయల్ సహా ప్రతిపక్షనేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
"సభ అధ్యక్షుడు సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సభలో జరగాల్సిన చర్చలపై ఎంపీలు ఏకాభిప్రాయానికి రావాలి. దీనిపై మీరు చర్చించేందుకు వీలుగా సభను సోమవారానికి వాయిదా వేస్తున్నాను."
-వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్
Lok Sabha Adjourned
లోక్సభ శుక్రవారం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష నేతలు నిరసనలకు దిగారు. విపక్షాల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్ ఓంబిర్లా. అయితే ఆందోళనలు ఉద్ధృతంగా మారటం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
తిరిగి ప్రారంభమయ్యాక మళ్లీ సభకు అంతరాయం కలిగింది. లఖింపుర్ ఖేరి ఘటనపై ఎంపీలు ఆందోళనలు చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దిగువ సభను డిసెంబర్ 20కి వాయిదా వేశారు.
Surrogacy Bill 2021
అంతకుముందు విపక్ష సభ్యుల నినాదాల నడుమే.. సరోగసీ నియంత్రణ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది.
ఒక మహిళ వేరే దంపతుల బిడ్డకు జన్మనివ్వడాన్ని సరోగసీ అంటారు.
సరోగసీ పేరుతో జరిగే వ్యాపారానికి, అంటే 'అద్దె గర్భం' విధానానికి అడ్డుకట్ట వేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. నైతికత, నిస్వార్థంతో సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి ఈ చట్టం ఎలాంటి అడ్డంకులు సృష్టించదు.
ఇదీ చూడండి : Children Aadhaar: నవజాత శిశువులకు ఆసుపత్రుల్లోనే ఆధార్!