తమిళనాడు రాజకీయాల్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న ఓ అంశం ఈసారి ఎన్నికల్లో ప్రస్తావనకు రావడం లేదు. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల మరణం తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీలంక తమిళుల అంశం జాడ లేదు. గతంలో మాదిరిగా రాష్ట్రంలోని నేతలు వారి కోసం హామీలు కురిపించడం లేదు. ఎన్నికల్లో ప్రధానాంశం కాదన్న అభిప్రాయంతో శ్రీలంక తమిళుల విషయాన్ని వదిలేశారు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల నేతలు వీటి నుంచి తమ దృష్టిని మళ్లించారు.
ఇదీ చదవండి: చిన్నమ్మ విడుదలతో తమిళ రాజకీయాల్లో మార్పులు?
1983లో తమిళులకు వ్యతిరేకంగా శ్రీలంకలో హింసాకాండ జరిగిన తర్వాత ఆ దేశంలోని సమస్య తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారింది. ఎల్టీటీఈ వంటి తీవ్రవాద సంస్థలు పుట్టుకురావడం వల్ల రాష్ట్రంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో తమిళుల హక్కుల పరిరక్షణకు పాటుపడుతున్నట్లు అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించుకున్నాయి. తమిళులను ఉద్ధరించేందుకు కట్టుబడి ఉన్నట్లు నేతలందరూ డాబుగా చెప్పుకున్నారు.
కాంగ్రెస్ వెనకడుగు?
శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలో ఎల్టీటీఈ ఓడిపోయిన 2009లో ఈ అంశం తమిళనాడు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశానికి అది అత్యున్నత దశగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి ఎదురుదెబ్బ తగలడానికి ప్రధాన కారణం కూడా ఇదేనన్నది విశ్లేషకుల మాట. లంక తమిళులకు అండగా ఉండాల్సిన సమయంలో ఇరుపార్టీలు వెనకడుగు వేశాయన్నది పలువురి వాదన.
ఇదీ చదవండి: చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?
2011లో అధికారంలోకి వచ్చిన జయలలిత.. శ్రీలంకకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించాలని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఎల్టీటీఈ పేరిట యుద్ధనేరాలకు పాల్పడిన శ్రీలంకకు అమెరికా మద్దతు పలకకుండా దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో డీఎంకే పక్షాన ఉండే తమిళ అనుకూలవాద సంస్థలు అన్నాడీఎంకే వైపు మళ్లాయి.
డీఎంకేకు అనుకూలం
ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఎన్నికల్లో శ్రీలంక తమిళుల ప్రస్తావన లేకపోవడం డీఎంకే, కాంగ్రెస్‌కు వరం లాంటిదేనని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ పరిస్థితులన్నీ ప్రాంతీయ సమస్యల చుట్టూనే ముడిపడి ఉండటం కలిసొచ్చే అంశమేనని అంటున్నారు.
"తమిళనాడు రాజకీయ నేతలు లంక తమిళుల గురించి వదిలేశారు. లంక తమిళుల దుస్థితి ఇక్కడి తమిళులను కలచివేస్తుందనడంలో సందేహం లేదు. రాజకీయ నాయకులు విఫలమయ్యారు. చేతులను దులిపేసుకున్నారు. రాజీవ్ గాంధీని హత్య చేసిన ఏడుగురు నిందితులను విడుదల చేయాలనే డిమాండ్‌ను ఇప్పటికీ కొందరు స్వాగతిస్తున్నారు. కానీ నేతలు మాత్రం ఈ అంశం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాలు ఉండవని భావిస్తున్నారు."
-బాబు జయ కుమార్, సీనియర్ పాత్రికేయులు
శ్రీలంకలోనూ తమిళుల అంశం ప్రస్తావనకు నోచుకోవడం లేదు. వేర్పాటువాద సమస్య సమసిపోయింది. యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలు జీవనోపాధి కోసమే ఆరాటపడుతున్నారు. అయితే యుద్ధనేరాలకు జవాబుదారీని చేయాలనే డిమాండ్ మాత్రం అక్కడక్కడ వినిపిస్తూనే ఉంది.
తమిళుల హృదయాల్లో యుద్ధం తాలూకు గాయాలు మానకపోయినప్పటికీ.. రాజకీయ పరిస్థితులు మాత్రం క్రమంగా మారిపోయాయి. లంక తమిళుల అంశం రాజకీయం నుంచి వేరువడింది. అయితే సాధారణ ప్రజానీకం మదిలో ఈ అంశం ఎప్పటికీ నిలిచే ఉంటుందని మాజీ సీఎం దివంగత జయలలిత ఎప్పుడూ చెబుతుండేవారు.
తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల ఫలితాలు మే 2న విడుదల అవుతాయి.
తమిళనాడు ఎన్నికలపై ప్రత్యేక కథనాలు: