LandSlides In Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలో 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. 9 మందికి గాయాలయ్యాయని, మరో ఆరుగురు గల్లంతయ్యారని తెలిపింది. గల్లంతైన వ్యక్తులు ప్రాణాలు కోల్పోయి ఉంటారేమోనని అనుమానాలు వ్యక్తం చేసింది.
మరోవైపు, మండీ జిల్లాలో గోహార్ సబ్ డివిజన్‌లోని జాదోన్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన్ ఖేమ్ సింగ్ అనే వ్యక్తి రెండంతస్తుల ఇంటిపై శనివారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ఇంటిలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.
అయితే ఘటనా సమయంలో ఖేమ్ సింగ్ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అనేక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అనేక గ్రామాల ప్రజలు వరుణుడి ప్రతాపానికి నానా పాట్లు పడుతున్నారని చెప్పారు.
కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి
భారీ వర్షాల ధాటికి చంబా జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎడతెరిపి లేని వర్షాల ధాటికి కాంగ్రా జిల్లాలోని పురాతన రైల్వే వంతెన కూలిపోయింది.
గ్రామంలో క్లౌడ్ బరస్ట్..
Cloudburst In Dehradun: ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాయ్‌పుర్ బ్లాక్‌లోని సర్ఖేత్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో చిక్కుకున్న ప్రజలందరినీ రక్షించి, సమీపంలోని రిసార్ట్‌లో ఆశ్రయం కల్పించామని సిబ్బంది తెలిపారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తంసా నది
దేహ్రాదూన్‌లోని ప్రసిద్ధ తపకేశ్వర మహాదేవ ఆలయం సమీపంలో ప్రవహించే తంసా నది ఉద్ధృత రూపం దాల్చింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆలయ వ్యవస్థాపకుడు బిపిన్ జోషీ తెలిపారు.
మాతా వైష్ణో దేవి ఆలయం సమీపంలో వరదలు..
జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలోని మాతా వైష్ణో దేవి సమీపంలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదల దృష్ట్యా మాతా వైష్ణో దేవి ఆలయానికి భక్తుల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించారు.
ఇవీ చదవండి: ముంబయికి బెదిరింపులు, ఉగ్ర దాడులు చేస్తామని పాక్ నుంచి మెసేజ్
టాబ్లెట్ షీట్‌పై వెడ్డింగ్ కార్డు, క్రియేటివిటీ అదుర్స్ కదా