కర్ణాటక నూలగ్గెరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు రేఖా ప్రభాకర్.. బడిలో పిల్లల సంఖ్యను పెంచడానికి వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాలలో ఒకటో తరగతిలో చేరే ప్రతి విద్యార్థి పేరున వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసుకున్న తర్వాత పై చదువులకోసం వడ్డీతో సహా ఆ డబ్బుల్ని వారు తీసుకోవచ్చు. ఆమె చేసిన ఈ ప్రయత్నంతో ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.
2010లో రేఖకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ బాధ్యతలు చేపట్టేనాటికి ఆ బడిలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 20 మాత్రమే. సంవత్సరానికి కేవలం ఒక్కరో, ఇద్దరో చిన్నారులు మాత్రమే పాఠశాలలో చేరేవారు.
దాంతో బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆమె నిర్ణయించుకున్నారు. తమ పిల్లల్ని పాఠశాలలోకి పంపించమని గ్రామ ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని కోరారు. చాలా సార్లు వారితో సమావేశాలు పెట్టారు కూడా. కానీ ఫలితం దక్కలేదు.
అప్పుడు ఆమెకో ఆలోచన వచ్చింది. ఆ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరే ప్రతి చిన్నారి పేరున వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అది ఆమె సొంత డబ్బు. ఇందుకు ఆమె భర్త కూడా సహకరించాడు. ఆమె చేసిన ఈ ప్రయత్నం ఫలించింది. మెల్లమెల్లగా పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది.
"నేను ఉద్యోగంలో చేరినప్పుడే విద్యార్థులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను చదువుకోవడానికి కూడా మా ఉపాధ్యాయులు ఆర్థిక సాయం చేశారు. అది గుర్తు పెట్టుకుని విద్యార్థులకు నా వంతు సాయం చేస్తున్నాను."
-రేఖా ప్రభాకర్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు.
ఇలా విద్యార్థుల ఖాతాలో నగదును జమ చేయడం 2014 నుంచి ప్రారంభించారు. దీనివల్ల ఆ పాఠశాలలో 63మంది చేరారు.
ఇదీ చదవండి: 'బంగాల్లో బలగాలపై దాడి దీదీ పనే'