కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (CEA) ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్ (KV Subramanian) బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తన మూడేళ్ల పదవీ కాలం పూర్తైన సందర్భంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పరిశోధన, విద్యా ప్రపంచంవైపు తిరిగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు డాక్టర్ కేవీ సుబ్రమణియన్ పేర్కొన్నారు.
'ప్రభుత్వంలో మూడేళ్లపాటు పనిచేసిన కాలంలో అద్భుతమైన ప్రోత్సాహం, మద్దతు లభించాయి. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, కీలక వ్యక్తులతోనూ స్నేహపూర్వక సంబంధాన్ని ఆస్వాదించాను. ఈ క్రమంలో దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను' అని కృష్ణమూర్తి సుబ్రమణియన్ (KV Subramanian) పేర్కొన్నారు. అంతేకాకుండా దాదాపు మూడుదశాబ్దాల వృత్తి జీవితంలో ప్రధాని మోదీ వంటి స్ఫూర్తిదాయకమైన నాయకుడిని ఎన్నడూ చూడలేదని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రధాని మోదీనే కాకుండా ఆర్థికశాఖమంత్రి, ఆ విభాగంలోని ఇతర ఉన్నతాధికారులతో పదవీ కాలంలో తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ కేవీ ట్విటర్‌లో పోస్టు చేశారు.
ఇదిలాఉంటే, 2018 డిసెంబర్ 7న కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కేవీ సుబ్రమణియన్ (KV Subramanian) బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆ పదవిలో ఉన్న అరవింద్ సుబ్రమణియన్ వైదొలిగిన ఐదు నెలలకు కేవీ ఆ బాధ్యతలు చేపట్టారు. తాజాగా సీఈఏగా మూడేళ్ల పదవీకాలం ముగియడంతో కేవీ సుబ్రమణియన్ బాధ్యతల నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'లఖింపుర్' కేసులో యూపీ ప్రభుత్వంపై సుప్రీం అసహనం