student goes to school by one leg: చదువుకోవాలనే తపన ఉంటే వైకల్యం కూడా అడ్డు రాదని నిరూపిస్తున్నాడు ఓ బాలుడు. ప్రమాదంలో కాలు కోల్పోయినా నిరాశ చెందకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుకోవడానికి అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠశాలకు చేరుకుంటున్నాడు.
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని హంద్వారాకు చెందిన మహ్మద్ పర్వేజ్‌కు చాలా ఏళ్ల క్రితం ప్రమాదంలో కాలు కాలిపోయింది. అనేక శస్త్ర చికిత్సలు చేసినా..ప్రయోజనం లేదు. చివరకు పర్వేజ్ కాలును తొలగించారు వైద్యులు. దీంతో అప్పటినుంచి ఒంటికాలితోనే జీవిస్తున్నాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న పర్వేజ్.. ఒక్క కాలితోనే గెంతుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నడిచి వెళుతున్నాడు. తనకు ప్రభుత్వం వీల్‌చైర్‌ను ఇచ్చినా.. తమ గ్రామంలోని రోడ్డుపై నడిచే పరిస్థితి లేదంటున్నాడు పర్వేజ్. అందుకే నడిచి వస్తున్నాని చెప్పాడు. చదడమే కాకుండా తన మిత్రులతో కలిసి క్రికెట్, వాలీబాల్ లాంటి క్రీడలన్నీ ఆడుతున్నాడు.
"2009లో జరిగిన ప్రమాదంలో నా కాలు కాలిపోయింది. చదువుకోవడానికి రెండు కిలోమీటర్లు దూరం మిత్రులతో కలిసి వస్తాను. భవిష్యత్తులో డాక్టర్ అయ్యి మా గ్రామానికి మంచి పేరు తెస్తాను."
- మహ్మద్ పర్వేజ్, విద్యార్థి
పర్వేజ్‌కు కృత్రిమ కాలు అమర్చే ఆర్థిక స్తోమత తన వద్ద లేదని అతడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పర్వేజ్‌కు చదువుకోవడం అంటే ఇష్టమని.. అందుకే ఎన్ని సమస్యలు ఎదురైనా రోజు పాఠశాలకు వెళతాడని అతడి తండ్రి తెలిపాడు. దయనీయ పరిస్థితుల్లో ఉన్న తనను ప్రభుత్వమే ఆదుకోవాలని పర్వేజ్ విజ్ఞప్తి చేస్తున్నాడు.
మరోవైపు, అచ్చం ఇలానే ఒంటికాలితో గెంతుకుంటూ స్కూల్‌కు వెళుతూ వైరల్‌గా మారిన బాలికకు కృతిమ కాలును అమర్చారు. బిహార్ జముయీ జిల్లా ఖైరా బ్లాక్‌లోని ఫతేపుర్ గ్రామంలో ఉండే సీమాకు రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయింది. దీనిపై అనేక మంది దాతలు స్పందించారు. తాజాగా బిహార్ ఎడ్యూకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ బాలికకు కృతిమ కాలును కానుకగా ఇచ్చింది. కృతిమ కాలు అమర్చడం వల్ల ఆమె నడుస్తూ పాఠశాలకు వెళ్లనుంది. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది సీమా.
ఇదీ చదవండి: వైకల్యంపై ఒంటికాలి పోరాటం... పదేళ్ల బాలిక సంకల్పం భేష్!