KRMB Meeting in Hyderabad : శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు తగినంతగా లేనందున వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సూచించింది. రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నుంచి తెలంగాణకు 35, ఆంధ్రపదేశ్‌కు 45 టీఎంసీలు కేటాయించింది. నీటి విడుదలకు సంబంధించి బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది.
KRMB Advise Two Telugu States use Krishna Water Thrift : కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే (Raipure)అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ నందన్ కుమార్ కూడా సమావేశంలో ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ ఏడాదిలో సాగు, తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి జలాశయాల్లోకి నీరు అంతగా చేరలేదని, ప్రస్తుతం సాగర్, శ్రీశైలం రెండింటిలో కేవలం 82.78 టీఎంసీలు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయని బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే తెలిపారు.
KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ
రానున్న జూన్, జులై వరకు తాగునీటి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందని రాయిపురే అన్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని (Krishna Water) పొదుపుగా వినియోగించుకోవాలని రెండు రాష్ట్రాలకు సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 80 టీఎంసీల నీటిలో అక్టోబర్ నుంచి మే నెల వరకు తెలంగాణకు 35 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన 2.788 టీఎంసీలతో పాటు ఇంకా ఏవైనా ప్రవాహాలు వస్తే వాటిని కూడా జూన్, జులై తాగునీటి అవసరాల కోసం నిల్వ చేయాలని.. రెండు ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టం ఉండేలా చూడాలని బోర్డు తెలిపింది.
KRMB Meeting Update : వర్చువల్‌గా కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం.. హాజరుకాని తెలంగాణ ఈఎన్సీ
మరోవైపు ఈ సంవత్సరం తెలంగాణ 45 టీఎంసీలను వినియోగించుకోగా 15 టీఎంసీలు రాష్ట్ర పరిధిలోని జలాశయాల్లో నిల్వ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 95 టీఎంసీలు వినియోగించుకోగా 50 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జల విద్యుదుత్పత్తి కోసం విడుదల చేస్తున్న నీటిని ఆ రాష్ట్ర కోటా కిందకు చేర్చాలని ఏపీ కోరగా.. అందుకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల ఉండదనీ తెలంగాణ ఆ మేరకు వినియోగించుకుంటుందని తెలపడంతో ఈ అంశం సద్దుమణిగింది.
కృష్ణా జలాల విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 30 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 15 టీఎంసీల జలాలు కావాలని కేఆర్‌ఎంబీ ముందు ప్రతిపాదించినట్లు వివరించారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీల కేటాయింపులో మార్పు లేదని నారాయణరెడ్డి చెప్పారు.
రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగంపై మాత్రమే కసరత్తు చేయాల్సి ఉంటుందని నారాయణరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విధివిధానాలు ఇంకా పూర్తిస్థాయిలో అందిన తరువాతే స్పష్టత వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన వేదికలపై ఆ విషయాన్ని ప్రస్తావిస్తామని వివరించారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించేందుకు అనువుగా నగరంలో భవనం సిద్ధమైందని, బోర్డు అధికారులు వచ్చి పరిశీలించాలని ఈ సందర్భంగా బోర్డు అధికారులకు ఈఎన్సీ నారాయణరెడ్డి సూచించారు.
Telangana Govt letter to KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
ఏపీ వాటాకు మించి నీటిని వాడుకుంది.. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ లేఖ