KMC election 2021 results: కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. మంగళవారం ఫలితాల లెక్కింపులో అఖండ విజయాన్ని సాధించింది. భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు డీలా పడ్డాయి. మొత్తం 144 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. టీఎంసీ ఇప్పటికే 54 సీట్లను కైవసం చేసుకుంది. మరో 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించింది.
తాజా విజయంతో వరుసగా మూడోసారి కోల్కతా పీఠాన్ని టీఎంసీ దక్కించుకున్నట్టైంది. 2015లో టీఎంసీ 131 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల శాతం విషయంలోనూ ప్రత్యర్థుల కంటే చాలా ముందంజలో ఉంది టీఎంసీ.
Mamata KMC election results
తాజా ఫలితాలపై టీఎంసీ అధినేత్రి, బంగాల్ సీఎం స్పందించారు. ఇది జాతీయ రాజకీయాల విజయమని అన్నారు. భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు ఉమ్మడిగా తమపై పోటీ చేసినా.. సత్తా చాటలేకపోయాయని ఎద్దేవా చేశారు.
"ఇది చారిత్రక విజయం. ప్రజలు మా పాలనను ఆమోదించారు. కాంగ్రెస్, భాజపా, వామపక్షాలు కనుమరుగయ్యాయి. ఇకపై ప్రజల కోసం, అభివృద్ధి కోసం మరింత మెరుగ్గా పనిచేస్తాం. మనం(టీఎంసీ కార్యకర్తలనుద్దేశించి) ఈ నేలమీద పుట్టిన బిడ్డలం. క్షేత్రస్థాయిలో మనం పనిచేస్తాం.. గాల్లో కాదు. అందువల్లే కోల్కతా దేశంలోనే సురక్షితమైన నగరంగా అవతరించింది."
-మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి
కోల్కతాలోని అర్బన్, సెమీ అర్బన్ల మధ్య అంతరాలను తొలగిస్తామని ఈ సందర్భంగా దీదీ పేర్కొన్నారు. అయితే, మేయర్ పదవి ఎవరు చేపడతారనే విషయంపై మౌనం వహించారు.
ఇదీ చదవండి: 'మున్సిపల్' ఎన్నికల్లో ఉద్రిక్తత- నాటు బాంబు దాడి