KK death political blame: ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్(కేకే) ఆకస్మిక మరణంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు, కేకే మృతి రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బంగాల్ సర్కారు వైఫల్యం వల్లే ఆయన చనిపోయారని భాజపా ఆరోపణలు గుప్పించగా.. ఈ ఘటనను రాజకీయం చేయడం ఏంటని టీఎంసీ ఆ పార్టీకి గట్టిగా బదులిస్తోంది.
Singer KK post-mortem: కాగా, కేకే మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తైంది. గుండెపోటు వల్ల ఆయన మరణించినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. కేకే అస్వస్థతకు గురై కుప్పకూలిన హోటల్.. కోల్‌కతా న్యూమార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై అసహజ మరణం కేసు నమోదు చేసుకున్నారు. హోటల్ మేనేజర్, సిబ్బందితో మాట్లాడారు. కేకేను ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు హోటల్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
"నజ్రుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత కేకే హోటల్‌కు తిరిగొచ్చారు. హోటల్ వద్ద గుంపులుగా ఉన్న అభిమానులు ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టారు. ఫొటోలు దిగేందుకు కొంతమంది ఫ్యాన్స్‌కు అనుమతి ఇచ్చారు. కొన్ని సెల్ఫీలు దిగి కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. లాబీ నుంచి పైకి వెళ్లిపోయారు. అక్కడే కింద పడిపోయినట్లు సమాచారం. కేకేతో పాటు ఉన్న కొంతమంది హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అనంతరం కేకేను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయన అప్పటికే చనిపోయారని నిర్ధరించారు. కింద పడటం వల్ల సింగర్‌కు రెండుచోట్ల(నుదిటికి ఎడమవైపు, పెదవులకు) గాయాలయ్యాయి."
-పోలీసులు
కేకేను రాత్రి 10 గంటలకు తీసుకొచ్చారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దురదృష్టవశాత్తు అప్పటికే ఆయన చనిపోవడం వల్ల చికిత్స అందించలేకపోయామని వైద్యులు తెలిపారు. కేకే మృతికి గుండెపోటు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో గుండెపోటు వల్లే చనిపోయినట్లు తేలింది.
బంగాల్ ప్రభుత్వం కేకే మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించింది. రవీంద్ర సదన్‌లో ఆయన భౌతికకాయాన్ని సందర్శించుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పుష్పాంజలి ఘటించారు. మమత సమక్షంలో ఆ రాష్ట్ర భద్రతా సిబ్బంది కేకే మృతదేహానికి నివాళిగా తుపాకీతో గాల్లోకి కాలుస్తూ గన్ సెల్యూట్ చేశారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని విమానాశ్రయానికి తీసుకెళ్లారు. కేకే మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ముంబయికి తీసుకురానున్నారు.
KK death political blame: కాగా, ఆడిటోరియంలో సామర్థ్యానికి మించి జనాలు గుమిగూడినట్లు తెలుస్తోంది. వాస్తవంగా దాని సామర్థ్యం 2,500-3,000. కానీ, పాల్గొన్నవారి సంఖ్య రెట్టింపుగా ఉందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. తమ అభిమాన గాయకుడి పాటలు వినడానికి పాస్‌లు లేనివారు కూడా లోపలకు వచ్చినట్లు చెప్పారు. భారీగా జనం లోపలకు వెళ్లే క్రమంలో ఆడిటోరియం నిర్వహణకు సంబంధించి పలు లోపాలు బయటపడ్డాయి. ఛాతినొప్పితో కుప్పకూలడానికి ముందు ఆడిటోరియంలోనే కేకే అసౌకర్యానికి గురయ్యారని, అక్కడి వేడికి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. గాలి సరిగా లేకపోవడం వల్ల ఉక్కపోతకు గురైన ఆయన చెమటలు తుడుచుకుంటున్నట్లు కనిపించారు. దానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
KK death auditorium AC: ఇప్పుడీ వసతుల లేమి.. రాజకీయ వివాదానికి దారితీస్తోంది. కేకే మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భాజపా ఆరోపణలు చేసింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కేకే కచేరీ వేళ కోల్‌కతా యంత్రాంగం తీవ్ర గందరగోళానికి గురైందని భాజపా నేత దిలీప్ ఘోష్ మండిపడ్డారు. 'బంగాల్ ప్రభుత్వం ప్రముఖులకు తగిన రక్షణ కల్పించడంలో విఫలమైంది. పాలనపై పట్టు కోల్పోతోంది. ప్రముఖుల పర్యటనల వేళ నిర్వహణ లోపం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. వారికి రక్షణ కల్పించడం యంత్రాంగం బాధ్యత. ఇంత వేడిలో ఆడిటోరియంలో ఏసీ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. దాని వల్ల ఆయన అస్వస్థతకు గురయ్యారో లేదో తెలియదు. కానీ.. ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని మాత్రం తెలుస్తోంది' అంటూ దిలీప్ ఘోష్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్ర డిమాండ్ చేశారు. 'ఆ హాల్ సామర్థ్యం ఎంత? ఎంత మందిని అందులోకి అనుమతించారు? అంత మందికి సరిపోయే విధంగా ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందా? ఆక్సిజన్ స్థాయిలు ఏ రకంగా ఉన్నాయి?' అని ప్రశ్నల వర్షం కురిపించారు. వీటన్నంటిపై దర్యాప్తు జరగాలని ట్వీట్ చేశారు. 'మూడు వేల మంది పట్టే చోటుకు ఏడు వేల మందిని అనుమతించారు. అక్కడే ఆయన్ను చాలా మంది చుట్టుముట్టారు. దీనర్థం వీఐపీకి భద్రతాపరమైన ఏర్పాట్లు చేయలేదు' అని భాజపా రాష్ట్ర ప్రతినిధి సామిక్ భట్టాచార్య ఆరోపించారు.
బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఈ ఘటనపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని.. కచేరీ జరిగిన ప్రదేశమే ఆయన మృతికి దారితీసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.
మరోవైపు, భాజపా ఆరోపణలకు టీఎంసీ దీటుగా బదులిస్తోంది. భాజపా నేతలు రాబందుల్లా వ్యవహరిస్తున్నారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ విమర్శలు గుప్పించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనను రాజకీయం చేయొద్దని హితవు పలికారు. 'కేకే మృతి విచారకరం. అందరికీ బాధగానే ఉంది. కానీ భాజపా చేస్తున్నదానిని మాత్రం ఎవరూ ఊహించలేదు. రాబందు రాజకీయాలను కమలదళం ఆపేయాలి. కేకేను తమ పార్టీ నాయకుడు అని భాజపా చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు' అని బదులిచ్చారు ఘోష్. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరణ ఇచ్చారు.
కచేరీ జరిగిన ఆడిటోరియంలో ఎయిర్ కండీషన్ వ్యవస్థ సరిగానే ఉందని కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీం స్పష్టం చేశారు. అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చారని చెప్పారు. 'కేకే చాలా పాపులర్ సింగర్. అతడికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆడిటోరియం సామర్థ్యం 2800 అని నేను విన్నా. కానీ సుమారు 7వేల మంది హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారైన చూడాలని వచ్చిన అభిమానులపై లాఠీ ఛార్జ్ చేయాలని పోలీసులకు ఎలా చెప్పగలం? ఈ మృతిని రాజకీయం చేయొద్దు' అని అన్నారు.