Funeral Arrangements before death: ఖమ్మం, శ్రీనివాసనగర్‌కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతుల కుమారుడు హర్షవర్ధన్. బీ ఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు 2013లో అస్ట్రేలియా వెళ్లాడు. బ్రిస్బేన్‌లో హెల్త్ మేనేజ్‌మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. ఆ తర్వాత క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఉద్యోగంలో చేరి ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2020 అక్టోబర్ నెలలో జిమ్ వ్యాయామం చేస్తుండగా దగ్గు, ఆయాసం రావడంతో వైద్యపరీక్షలు చేయించుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ అని నిర్దారణ అయ్యింది.
అంతా బాగుందని అనుకునే సమయంలోనే: ఈ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్న హర్షవర్దన్ ముందుగా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమె జీవితంలో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. తనను వేధిస్తున్న క్యాన్సర్ వ్యాధికి ఆస్ట్రేలియాలోనే చికిత్స తీసుకుంటూ కొన్ని రోజులకు కోలుకున్నాడు. తిరిగి తన విధుల్లో చేరాడు. అంతా బాగున్నట్లే అనిపించడంతో 2022 సెప్టెంబర్‌లో ఖమ్మం వచ్చి 15 రోజులు గడిపి వెళ్లాడు. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది.
చనిపోతానని తెలిసి: హర్షవర్దన్ చనిపోతాడని 2023 మార్చి చివరి వారంలో వైద్యులు అతనికి చెప్పారు. తన మరణ తేదీని తెలుసుకున్న హర్షవర్ధన్ చావుకు భయపడలేదు. మృత్యువును ధైర్యంగా ఆహ్వానించాలనుకున్నాడు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులకు ఫోన్‌లో విషయం వివరించాడు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. తాను మరణించిన తర్వాత భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించేందుకు చట్టపరంగా అవసరమైన చర్యలన్నీ పూర్తి చేశాడు.
మృతదేహాన్ని తీసుకోమని ముందస్తు సమాచారం: ప్రత్యేకంగా ఒక న్యాయవాదిని పెట్టుకుని ఆ దేశ చట్టాలకు అనుగుణంగా అనుమతులు తీసుకున్నాడు. అందుకు అవసరమైన 15 లక్షల రూపాయలు తానే చెల్లించాడు. తల్లిదండ్రులకు ముందే సమాచారం ఇచ్చిన హర్షవర్దన్ తన మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో తీసుకోవాల్సిందిగా సూచించాడు. మార్చి 24న హర్షవర్దన్ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. చనిపోయే ముందు వీడియోకాల్ ద్వారా బంధువులు, స్నేహితులు అందరితో మాట్లాడాడు. ఆ తర్వాత విశ్రమించిన హర్షవర్దన్ అలానే చనిపోయాడు.
హర్ష వర్దన్ చెప్పినట్లుగానే.. అతని మృతదేహం బుధవారం ఉదయం ఖమ్మంలోని స్వగృహానికి చేరింది. తాను ముందే ఏర్పాట్లు చేసుకున్నట్లుగా వర్షవర్దన్ భౌతికకాయానికి తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతా బాగుంటే మే 21న హర్షవర్దన్ స్వదేశం రావాల్సి ఉంది. ఇంతలోనే ఇలా జరగటంతో ఆయన ఇంటి వద్ద విషాధచాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: