కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. వసంతనగర్లోని కేజీఎఫ్ బాబు నివాసంలోని రుక్సానా ప్యాలెస్లో ఐటీ అధికారులు బుధవారం వేకువజామున తనిఖీలు నిర్వహించారు.
కేజీఎఫ్ బాబు.. కాంగ్రెస్ తరఫున చిక్కపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుదామని ఆశపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల ఆయనను ఈ ఏడాది జనవరిలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుదామని అనుకునేలోపే కేజీఎఫ్ బాబు ఇంటిపై ఐటీ దాడులు జరగడం గమనార్హం.
మరోవైపు.. కేజీఎఫ్ బాబు తన భార్య షాజియాను చిక్కపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారు. ఇటీవలే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన కుమార్తెతో కలిసి కేజీఎఫ్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇంటింటికీ పోస్టు ద్వారా డీడీలు పంపించినందుకు కేజీఎఫ్ బాబుపై ఏప్రిల్ 4న సిద్ధాపుర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒక్కో పోస్టు కార్డులో రూ.1,105 పెట్టి మూడు వేల మందికి డీడీ పంపించారని కేజీఎఫ్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న సిద్ధాపుర్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి సుమారు రూ.30 లక్షల విలువైన డీడీలను స్వాధీనం చేసుకున్నారు.
కేజీఎఫ్ బాబు అసలు పేరు యూసుఫ్ షరీఫ్. ఆయన 2021లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకు రూ. 1643 కోట్లు ఆస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
బీజేపీ నేత ఇంటిపై కూడా..
మరోవైపు చామరాజనగర్లో బీజేపీ నేత ఇంటిపైన ఐటీ దాడులు జరిగాయి. చామరాజనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత వృషబేంద్రప్ప ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోమన్న నామినేషన్ దాఖలు చేసి.. ప్రచారం చేస్తున్నారు.
కర్ణాటకలో మే నెల 10న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అలాగే జేడీఎస్ కూడా మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అధికార బీజేపీ నుంచి కాంగ్రెస్, జేడీఎస్లోకి నేతలు వలస కడుతున్నారు. మూడు రోజుల క్రితం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్.. బీజేపీని వీడి హస్తం గూటికి చేరారు.