కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల.. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కేరళ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 244 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవగా.. అన్ని స్థానాలకు ఫలితాలు వచ్చేసరికి రాత్రి ఒంటి గంట అవుతుందని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. విజయోత్సవ సంబరాలు 100 మంది మించకుండా నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. కేరళలో స్థానిక ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించగా రికార్డు స్థాయిలో దాదాపు 75 శాతంపైగా పోలింగ్ నమోదైంది