Kerala Lawyer marriage Omicron: ప్రపంచంపై కొత్తగా విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. కేరళలో ఓ వివాహానికి ఆటంకం కలిగించింది. లాయర్ జంట మధ్య కుదిరిన వివాహానికి అడ్డంకులు ఎదురుకావడం వల్ల కేరళ హైకోర్టు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.
Lawyer couple online marriage
25 ఏళ్ల రింటూ థామస్, ఆమె కాబోయే భర్త అనంత కృష్ణన్ హరికుమారన్ నాయర్.. నెలరోజుల క్రితమే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. డిసెంబర్ 23న వివాహం జరగాల్సి ఉంది. ఒమిక్రాన్ భయాలు లేనందున పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు. అయితే, పై చదువుల కోసం యూకేలో ఉన్న వరుడు నాయర్.. భారత్‌కు రాలేకపోయారు. విమాన టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ.. ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల ప్రయాణించే అవకాశం లేకపోయింది.
Kerala HC Lawyers marriage
అయితే, ఎలాగైనా వివాహం చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్న ఈ జంట.. హైకోర్టును ఆశ్రయించింది. ఆన్లైన్ ద్వారా వివాహం చేసుకునేందుకు వీలు కల్పించాలని, ఈ పెళ్లికి చట్టబద్ధత కల్పించేలా మ్యారేజీ అధికారి, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆదేశించాలని కేరళ హైకోర్టులో థామస్ పిటిషన్ వేశారు.
ఈ జంటకు ఊరట కల్పిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ నగరేశ్.. ఉత్తర్వులు జారీ చేశారు. మ్యారేజీ అధికారి ముందు నేరుగా హాజరు కాకపోయినప్పటికీ.. ఈ వివాహాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు. ఆన్లైన్లో వివాహం చేసుకున్న వధూవరులను గుర్తించి, సాక్షుల సమక్షంలో వివాహాన్ని నమోదు చేయాలని సూచించారు. వివాహ సమయం, ఆన్లైన్ మాధ్యమాన్ని మ్యారేజీ అధికారి ఎంపిక చేసి.. పిటిషనర్లకు తెలియజేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: జర్మనీ అబ్బాయి.. రష్యా అమ్మాయి.. భారత్‌లో పెళ్లి