Kerala High Court On Marriage : మారుతున్న సంస్కృతి ప్రభావం వివాహ సంబంధాలపైనా పడినట్లు కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. యువతరం సైతం వివాహాలను చెడుగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే సహజీవనాలు పెరుగుతున్నాయని.. చివరకు సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. భార్య తనపై వేధింపులకు పాల్పడుతోందని పేర్కొంటూ, విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్ ఎ.ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
కేసు నేపథ్యమిది..: కేరళలోని అలప్పుళ జిల్లాకు చెందిన ఓ జంటకు 2009లో వివాహమైంది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే, అతనికి 2017నుంచి మరొక మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్య ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే.. ఆమె తనపై వైవాహిక క్రూరత్వానికి పాల్పడుతోందంటూ భర్త.. విడాకుల కోసం 2018లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. అతను తన ఆరోపణలను నిరూపించడంలో విఫలమయ్యాడని పేర్కొంటూ అతని పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. 'ప్రత్యేకంగా ఈ కేసులో.. తన భర్త వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భార్య నుంచి వచ్చే సాధారణ స్పందనను.. అసాధారణ ప్రవర్తన, క్రూరత్వంగా పేర్కొనలేం' అని తేల్చిచెప్పింది. దంపతుల మధ్య చిన్నపాటి కలహాలు, సంసారంలోని సాధారణ ఆటుపోట్లు, భావోద్వేగాల ప్రకటనను క్రూరత్వంగా పరిగణించేందుకు నిరాకరించింది. వివాహేతర సంబంధం కలిగి ఉన్నప్పటికీ అతని భార్య.. అతన్ని తిరిగి అంగీకరించేందుకు సిద్ధంగా ఉందని గుర్తుచేసింది. ఈ క్రమంలోనే అతని పిటిషన్‌ను తోసిపుచ్చింది.
'కేరళ ఒకప్పుడు మంచి కుటుంబ సంబంధాలకు ప్రసిద్ధి. కానీ.. ప్రస్తుత ధోరణి చూస్తుంటే బలహీనమైన, స్వార్థపూరిత కారణాలు, వివాహేతర సంబంధాలు వాటిని విచ్ఛిన్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కనీసం పిల్లల గురించి కూడా పట్టించుకోవడం లేదు. 'యూజ్ అండ్ త్రో' సంస్కృతి.. వివాహ సంబంధాలనూ ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. సహజీవనాలు పెరుగుతున్నాయి. యువత సైతం వివాహాలను చెడు భావనతో చూస్తోంది. 'WIFE' అనే పదాన్ని ఒకప్పుడు 'Wise Investment For Ever'గా పేర్కొనగా.. ఇప్పుడు దాన్ని 'Worry Invited For Ever'గా అర్థం మార్చేస్తోందని కేరళ హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఇటువంటి పరిణామాలు సమాజ నైతికతపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి: ఝార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ!