నాలుగేళ్లు అంటే అప్పుడే పాఠశాలకు చిట్టిపొట్టి అడుగులు వేసుకుంటూ వెళ్లే వయసు. మాటలు తడబడే సమయం. కానీ.. కేరళకు చెందిన మణికుట్టి అనే చిన్నారి మాత్రం.. అందరూ ఆశ్చర్యపోయేలా యోగాసనాలు చేస్తోంది.
మణికుట్టి అసలు పేరు.. రిత్విక. కొల్లంకు చెందిన వెంకట కృష్ణన్, డా.రేష్మ కృష్ణన్‌ల పెద్ద కూతురు. వయసు.. 4 ఏళ్ల 9 నెలలు. కానీ.. అప్పుడే మూడు ప్రతిష్ఠాత్మక రికార్డులను తన పేరిట లిఖించుకుందీ చిన్నారి. 5 నిమిషాల 45 సెకన్లలో 50 యోగాసనాలు చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ రికార్డ్స్, కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
నాలుగు నిమిషాల్లో 14 యోగాసనాలతో ఇదివరకు.. మహారాష్ట్రకు చెందిన వన్య శర్మ నెలకొల్పిన రికార్డును చిన్నారి మణికుట్టి బద్దలు కొట్టింది. ధనురాసన, అశ్వాసన, ఛలానాసన, ఛక్రాసన సహా 50 ఆసనాలను వరుస క్రమంలో నిర్దిష్ట సమయంలో వేసింది.
తల్లి స్ఫూర్తితో..
మణికుట్టికి యోగాసనాలు వేయడంలో వాళ్ల అమ్మ రేష్మనే.. స్ఫూర్తి. ఆయుర్వేద వైద్యురాలైన రేష్మ.. యోగా శిక్షణ కూడా ఇచ్చేవారు. లాక్డౌన్లో తల్లి ఆన్లైన్ యోగా తరగతులు చూసి ప్రేరణ పొందిన మణికుట్టి.. మెల్లగా ఆసనాలు వేయడం ప్రారంభించింది. ఎంతో సులువుగా, సరళంగా కుట్టి ఆసనాలు వేయడాన్ని గమనించిన రేష్మ.. చిన్నారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు.
అనంతరం రికార్డులకు కోసం ప్రయత్నించగా.. మూడింటిని కైవసం చేసుకున్నారు. ఇక తన రెండేళ్ల చెల్లికి యోగా నేర్పిస్తూ.. చిన్న వయసులోనే శిక్షకురాలిగా మారింది ఈ చిట్టి మణికుట్టి.
ఇదీ చూడండి: యోగా చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!