గడ్డం బాగా పెంచిన వారిని చూస్తే తాగుబోతు, లవ్ ఫెయిల్యూర్, నిరుద్యోగి అని భావిస్తారు చాలా మంది. ఇలాంటి అవమానాలెన్ని ఎదురైనా కేరళకు చెందిన కొంతమంది యువకులు మాత్రం ఓ ప్రత్యేక కారణంతో గడ్డాలను పెంచుతున్నారు. 'కేరళ బియర్డ్ సొసైటీ' సభ్యులైన వీరంతా సామాజిక సేవ చేసేందుకు గడ్డం పెంచడాన్ని మార్గంగా ఎంచుకున్నారు.
ఏం చేస్తారంటే..?
షేవింగ్ చేయాలంటే ఎంతో కొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. దానికయ్యే ఖర్చులను దాచిపెట్టి, ఆ డబ్బులను సామాజిక సేవ కోసం వినియోగిస్తారు ఈ 'కేరళ బియర్డ్ సొసైటీ' సభ్యులు. మలప్పురానికి చెందిన అనాజ్ అబ్దుల్లా.. 2017లో తన మిత్రులతో కలిసి ఈ సొసైటీని ప్రారంభించాడు. ఇప్పుడు ఈ సొసైటీలో కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.
ఇలా గడ్డాన్ని ఎక్కువగా పెంచడం వల్ల వీరికి కుటుంబ సభ్యుల నుంచే కాదు... బయటివారి నుంచి కూడా అప్పుడప్పుడు అవమానాలు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ.. సామాజిక సేవ కోసం గడ్డాన్ని పెంచాలన్న తమ సంకల్పాన్ని మాత్రం తాము వీడబోమని చెబుతున్నారు ఈ సభ్యులు.
"మా పెరిగిన గడ్డాన్ని చూసినప్పుడు చాలా మంది మాపై జోకులు వేసేందుకు ప్రయత్నించేవారు. కానీ, మేమిలా గడ్డం పెంచడానికి వెనుక ఉన్న కారణం తెలుసుకున్న కొంతమంది మాత్రం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఏదేమైనా మా కార్యక్రమాలను కొనసాగించాలనే మేం నిశ్చయించుకున్నాం. గడ్డాలను మేం ఎప్పటికీ తొలగించం" అని అనాజ్ అబ్దుల్లా తెలిపారు.
ఇదీ చూడండి: భార్యతో గొడవ.. కోపంలో ఏడేళ్ల కూతురిని కడతేర్చిన తండ్రి
ఇదీ చూడండి: రైల్వే క్రాసింగ్ వద్దే మహిళ ప్రసవం.. అంబులెన్సుకు ఫోన్ చేసినా..