నూతన సాగు చట్టాల రద్దు నిరసనల్లో భాగంగా దిల్లీకి ఏ క్షణమైనా పయనమై వెళ్లేందుకు రైతులంతా తమ ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచాలని పిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్. రైతులను సంప్రదించకుండానే ఈ చట్టాలను రూపొందించారని టికాయిత్ ఆరోపించారు.
''రైతులంతా తమ తమ పొలాల్లో పని చేస్తూ ఉండండి. అయితే మీ ట్రాక్టర్లలో ఇంధనాన్ని నింపి సిద్ధంగా ఉంచండి. ఎందుకంటే ఏ క్షణమైనా దిల్లీకి వెళ్లాల్సిరావచ్చు.''
-రాకేశ్ టికాయిత్
మరోవైపు.. దేశవ్యాప్తంగా కిసాన్ మహాపంచాయత్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉందని టికాయిత్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల రైతుల సమస్య దేశం మొత్తం తెలుసుకుంటుందని వివరించారు. రైతు డిమాండ్లను పరిష్కరించకపోతే ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్రం రూపొందించిన నూతన సాగు చట్టాలను నల్ల చట్టాలుగా అభివర్ణించిన ఆయన.. వాటిని వెనక్కు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
''ధాన్యం గింజలను లాకర్లో పెట్టిన కేంద్రం.. ఆకలితో వ్యాపారం చేయాలని చూస్తోంది. అయితే రైతులుగా మేము దాన్ని జరగనివ్వం.''
-రాకేశ్ టికాయిత్
ఫిబ్రవరి 24న రాజస్థాన్‌లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌లో మాట్లాడుతూ.. చట్టాలు రద్దు చేయకుంటే 40లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును చుట్టుముడతామని టికాయిత్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ఆ చట్టాలు రద్దు చేయకుంటే పార్లమెంట్ చుట్టుముడతాం'