ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్(kedarnath temple closed) ఆలయాన్ని.. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈరోజు మూసివేశారు. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆలయం మూసి ఉంటుందని చార్ధామ్ దేవస్థానం నిర్వహణ బోర్డు తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ (kedarnath temple news), బద్రీనాథ్ ఆలయాలను కలిపి చార్‌ధామ్‌గా(char dham yatra) పిలుస్తారు.
సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాల అనంతరం కేదార్‌నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు హాజరయ్యారు.
యమునోత్రి మూసివేత
సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు యమునోత్రి ఆలయాన్ని మూసివేశారు. యమునా దేవి, ఆమె సోదరుడు షాని మహరాజ్, తల్లి భోగ్మూర్తి ఉత్సవ్ డోలీలను ఊరేగింపుగా జంకి ఛాటి సమీపంలోని ఖర్సాలీ గ్రామానికి తరలించారు. ఈరోజు సాయంత్రానికి అమ్మవారు అక్కడికి చేరుకుంటారు. బైయా దూజ్ సందర్భంగా యమునా దేవి సోదరుడు యమరాజ్ సైతం ఖర్సాలీ గ్రామానికి చేరుకుంటాడు. యుమునా నదిలో ఈరోజు స్నానం ఆచరిస్తే అన్నాచెల్లెల్లకు మంచి జరుగుతుందని నమ్ముతారు.
గంగోత్రి మూసివేత..
మరోవైపు.. గంగోత్రి ఆలయాన్ని శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాల అనంతరం 11.45 గంటలకే మూసివేశారు. ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు హాజరయ్యారు. ఆలయంలోని ఉత్సవ డోలిని(గంగామాత ఉత్సవ విగ్రహం) ముఖ్బాకు తరలించారు. ఆరు నెలల పాటు గంగామాతకు అక్కడే పూజలు జరగనున్నాయి. భాయ్ దూజ్ కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాదిలో గంగోత్రి ధామ్‌కు 32,948 మందికిపైగా భక్తులు వచ్చినట్లు ఉత్తరకాశీ మయుర్ దిక్సిత్ జిల్లా పాలనాధికారి తెలిపారు.
కోర్టు తీర్పుతో..
చార్ధామ్ యాత్రపై(char dham yatra) ఉన్న నిషేధాన్ని సెప్టెంబర్ 16న నైనితాల్ హైకోర్టు ఎత్తివేసిన క్రమంలో సెప్టెంబర్ 18న యాత్ర ప్రారంభమైంది. పూర్తిస్థాయిలో టీకా తీసుకుని, కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారినే అనుమతించారు. అక్టోబర్ 22 వరకు నాలుగు ఆలయాలను మొత్తం 2 లక్షల మందికిపైగా భక్తులు సందర్శించినట్లు దేవస్థానం బోర్డు తెలిపింది.
నవంబర్ 20న బద్రినాథ్ ఆలయం మూసివేయనున్నారు.
ఇదీ చూడండి: కేదార్‌నాథ్‌లో మోదీ ప్రత్యేక పూజలు- ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ