భూతల స్వర్గంగా పేరుగాంచిన కశ్మీర్‌లో వరస పౌర హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ పోలీసులు, సాయుధ బలగాలపై దాడులకు తెగబడ్డ ముష్కరులు ఇప్పుడు పంథా మార్చి, సాధారణ పౌరుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు. ప్రధానంగా అల్పసంఖ్యాకవర్గాలు, స్థానికేతరులు లక్ష్యంగా మారణకాండ సృష్టిస్తున్నారు. ఫలితంగా కశ్మీరీ పండితులు, ఇతర అల్పసంఖ్యాకవర్గాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 1990ల నాటి విధ్వంస దృశ్యాలను గుర్తుచేసుకొని బరువెక్కిన హృదయాలతో కశ్మీర్ లోయను వీడుతున్నారు.
సామూహిక వలసలు..
ఇటీవలి వరకు కాస్తంత ప్రశాంతంగా కనిపించిన కశ్మీర్‌లో ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ మారిపోయాయి. రెండు రోజల క్రితం ముష్కరులు ఇద్దరు సాధారణ పౌరులను పొట్టనపెట్టుకొన్నారు. వీరు బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి కశ్మీర్‌కు వలసవచ్చారు. అంతకు ముందు వారం వ్యవధిలోనే ఏడుగురిని ఉగ్రమూకలు ఇలాగే బలితీసుకున్నాయి. శ్రీనగర్‌లో ఓ ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడి ప్రధానోపాధ్యాయురాలిని, మరో ఉపాధ్యాయుడిని దారుణంగా కాల్చిచంపిన తీరు అందరిలో తీవ్ర భయాందోళనలు రేపింది. దానికి రెండు రోజుల ముందు మరో ముగ్గురు పౌరులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. కశ్మీర్‌లో 1990ల్లో అల్పసంఖ్యాకవర్గాలే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడులు, అత్యాచారాలు, హత్యలకు తెగబడ్డాయి. దాంతో వేలమంది కశ్మీరీ పండితులు, అల్పసంఖ్యాకవర్గాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని లోయను వీడారు. ప్రస్తుతం పది నుంచి ఇరవై శాతం పండితులు మాత్రమే అక్కడ నివాసముంటున్నారు. ఆనాటి భారీ వలసల అనంతరమూ జమ్మూకశ్మీర్‌లో అల్పసంఖ్యాకవర్గాలపై దాడులు ఆగలేదు. 1998 జనవరిలో వంధామా పట్టణంలో 26 మంది కశ్మీరీ పండితులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. 2000 మార్చిలో అనంత్‌నాగ్‌లో 35 మంది సిక్కులను ఊచకోత కోశారు. వలస వెళ్లిపోయిన పండితులను తిరిగి కశ్మీర్‌కు రప్పించి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వాలు గట్టిగానే కృషిచేశాయి. భారీగా సాయుధ సిబ్బందిని మోహరించి వారి భద్రతపై భరోసా కల్పించే ప్రయత్నాలు చేపట్టాయి. ప్రధానమంత్రి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద కశ్మీరీ పండితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఫలితంగా పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కొన్ని పండితుల కుటుంబాలు మళ్ళీ కశ్మీర్ బాట పట్టాయి. ఆ వర్గానికి చెందిన దాదాపు నాలుగు వేల మంది యువకులు ప్రధాని ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రస్తుతం ఉద్యోగాల్లో కుదురుకొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 30న శ్రీనగర్ వీధుల్లో వందల మంది కశ్మీరీ పండితులు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. గత మూడు దశాబ్దాల్లో అక్కడ వారు ఇంత ఆడంబరంగా వేడుకలు నిర్వహించుకోవడం ఇదే తొలిసారి. దీంతో పరిస్థితులు కుదుటపడ్డాయని, మరిన్ని పండితుల కుటుంబాలు లోయకు చేరుకోవడం ఖాయమని అంతా భావించారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న వరస హత్యలతో పరిస్థితి తారుమారయింది.
పాఠశాలపై టీఆర్‌ఎఫ్ ముష్కరుల దాడి కశ్మీర్‌లో తీవ్ర అలజడికి కారణమైంది. దీనికితోడు ముష్కరులు హిట్‌లిస్టు తయారుచేసుకొని, అందులోని వ్యక్తులు లక్ష్యంగా దాడులకు తెగబడబోతున్నారన్న కథనాలు కశ్మీర్ లోయలోని అల్పసంఖ్యాకవర్గాల్లో తీవ్ర భయాందోళనలు నింపుతున్నాయి. పాఠశాలలు, పలు కార్యాలయాలు అల్పసంఖ్యాక వర్గాల సిబ్బందికి 10 రోజుల సెలవులు ప్రకటించాయి. తాజా పరిణామాలతో శ్రీనగర్ సహా లోయలోని పలు ప్రాంతాల్లో మైనారిటీలు అడుగు బయటపెట్టేందుకే వణికిపోతున్నారు. 400 కశ్మీరీ పండితుల కుటుంబాలు ఉండే షేక్‌పొర ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ప్రాణభయంతో కశ్మీరీ పండితులు, ఇతర అల్పసంఖ్యాల వర్గాల ప్రజలు జమ్మూ, దిల్లీ వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ప్రధానమంత్రి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందినవారూ వెనక్కి మళ్ళుతున్నారు. లోయలోని కశ్మీరీ పండిత కుటుంబాల్లో దాదాపు 70శాతం ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
పాక్ కుయుక్తులు..
ఆర్టికల్-370 రద్దు తరవాత జమ్మూకశ్మీర్‌లో ముష్కర దాడులు గణనీయంగా తగ్గాయని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం పదేపదే నొక్కి వక్కాణిస్తోంది. అది ఎంతమాత్రం నిజం కాదని స్థానికులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలి హత్యలనే అందుకు నిదర్శనంగా చూపుతున్నారు. ప్రస్తుత మారణకాండపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. కశ్మీరీ పండితుల భద్రతకు భరోసా కల్పించాలి. మిగిలిన అల్పసంఖ్యాక వర్గాల్లో ధైర్యం నింపడమూ తప్పనిసరి. ముష్కరుల ఆగడాలను సమర్థంగా అడ్డుకునేలా పటిష్ఠ చర్యలు తీసుకోవడం అత్యవసరం. అఫ్గానిస్థాన్‌లో 1990ల్లో తాలిబన్లు బలంగా ఉన్నప్పుడు కశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఇప్పుడు అఫ్గాన్‌లో ఆ మూకలే గద్దెనెక్కాయి. వారితో అంటకాగుతున్న పాకిస్థాన్- జమ్ముకశ్మీర్, పంజాబ్‌లలో దాడుల ద్వారా భారత్‌ను అస్థిరపరిచేందుకు గుంటనక్కలా ఎదురుచూస్తోంది. ప్రస్తుత అఫ్గాన్ పాలకులకు జైషేమహమ్మద్, అల్‌ఖైదా సహా అనేక ఉగ్రసంస్థలతో సత్సంబంధాలున్నాయి. ఇటీవల కారాగారాల నుంచి వేల మంది ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరగాళ్లను తాలిబన్లు విడుదల చేశారు. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొని, తాలిబన్ల తోడ్పాటుతో కశ్మీర్‌లో దాడులకు పాల్పడేందుకు, మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. వీటికి ఏమాత్రం ఆస్కారం లేకుండా కేంద్ర ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించాలి. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, చొరబాట్లను అరికట్టాలి. ముష్కర మూకల కుట్రలను భగ్నం చేయడంలో స్థానిక రాజకీయ పక్షాల సహకారమూ తీసుకోవాలి.
భయాందోళనలు సృష్టిస్తున్న టీఆర్‌ఎఫ్..
ఇటీవల కశ్మీర్‌లో అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా వరస హత్యలకు పాల్పడుతోంది తామేనని 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)' ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. ఇది నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ. ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరుకావాలని విద్యార్థులను ఆదేశించడంవల్లే పాఠశాలపై దాడి చేశామని టీఆర్‌ఎఫ్ ప్రకటించింది. అంతకుముందు తమ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురిపై పోలీసు ఇన్ఫార్మర్లు, ఆర్‌ఎస్‌ఎస్ వర్గీయులు అనే ముద్ర వేసింది. ఈ ఉగ్ర ఘాతుకాలను 'హైబ్రిడ్ టెర్రరిజం'గా అభివర్ణిస్తున్నారు. ఏకే-47 వంటి ఆయుధాలతో గుంపులుగా దాడులకు తెగబడకుండా, చిన్న తుపాకులతో నిర్దేశిత వ్యక్తుల ఉసురు తీయడం నూతన పంథా ఉన్మాదం. ప్రశాంత పౌర జీవనంలో తీవ్ర అలజడి, భయాందోళనలు సృష్టించడమే టీఆర్‌ఎఫ్ లక్ష్యం.
- మండ నవీన్ కుమార్ గౌడ్
ఇవీ చదవండి: