కరోనాతో ఆన్‌లైన్ క్లాసులు నిత్యకృత్యమైన వేళ.. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులతో పాటు ఉపాధ్యాయులకూ నెట్‌వర్క్ సమస్యలు తప్పడం లేదు. అయితే.. అందరిలా ఈ సమస్యను నిందించకుండా సొంతంగా పరిష్కరించి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కర్ణాటక కొడగు జిల్లాలోని సీఎస్ సతీశ్. ముల్లూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆయన ఓ చెట్టుపై 20 అడుగుల ఎత్తులో ఓ ఇంటిని నిర్మించారు.
గ్రామీణ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు బోధిస్తున్న ఆయన.. చిక్కుకోలథర్ గ్రామంలోని తన ఇంటి ప్రాంగణంలో 'ట్రీ హౌస్'ను నిర్మించారు. వెదురు, మలబార్ సాగోపామ్ చెట్లపై నిర్మించిన ఈ ఇంట్లో మోడల్ తరగతినీ ఏర్పాటు చేశారు. సొంత ఖర్చులతో మొబైల్ స్టాండ్‌తో పాటు.. రికార్డర్‌ను కొనుగోలు చేశారు.
"కరోనా వల్ల చిన్నారులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. కాబట్టి వాట్సాప్ ద్వారా పాఠాలకు సంబంధించిన సమాచారం పంపించాం. కానీ కొంతమంది విద్యార్థులు నెట్‌వర్క్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకే నా సొంత డబ్బుతోనే ఈ ట్రీ హౌస్‌ను నిర్మించాను. అందుకు పెద్దగా ఏమీ ఖర్చుకాలేదు. పాఠశాలకు వెళ్తున్నప్పుడు సైతం విద్యార్థుల కోసం కొంత డబ్బు వెచ్చించేవాడిని."
-సీ.ఎస్.సతీశ్, టీచర్
పిల్లలు సులువుగా నేర్చుకునేందుకు ఆసక్తికరంగా ఉండే తరగతులు నిర్వహించే సతీశ్ మాస్టార్.. ఈ ట్రీహౌస్‌లో 3 రకాల బ్లాక్‌బోర్డులు అమర్చారు. పాఠాలతో పాటు, యోగా, ఇండోర్ గేమ్స్, కథలు చెప్పడం సహా ఇంగ్లీష్ బోధిస్తున్నారు. హోమ్‌వర్క్‌లు వాట్సాప్ ద్వారానే ఇస్తుంటారు.
ఇవీ చదవండి: