Karnataka Silkworm friends: కర్ణాటకలో మతసామరస్యం మల్బరీ పట్టులా మెరుస్తోంది. వేర్వేరు మతాలకు చెందిన నలుగురు వ్యక్తుల స్నేహం.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. కుల, మత భేదాలేవీ తమకు లేవని నిరూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేరళలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ కుటుంబాలకు చెందిన నలుగురు స్నేహితులు.. కర్ణాటకలో ఒకే ఇంట్లో ఉంటూ, కలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకరినొకరి మతాచారాలను గౌరవిస్తూ.. అన్యమతాల పండగలను సైతం మనస్ఫూర్తిగా జరుపుకుంటున్నారు.
Religious tolerance Karnataka
కేరళలోని అలప్పీకి చెందిన జీజో, మేలాట్టుర్కు చెందిన అబ్దుల్ కరీమ్, మలప్పురానికి చెందిన రాజీవ్, అబులీశ్లు.. కర్ణాటకలోని చామరాజనగర్‌లో నివాసంఉంటున్నారు. కులుగామా గ్రామంలో 16 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని గత మూడేళ్లుగా వీరంతా పట్టు వ్యవసాయం చేస్తున్నారు. ఈ నలుగురు మిత్రులు గతంలో విదేశాల్లో పనిచేసేవారు. జీజో ఇంగ్లాండ్‌లో ఇంజినీర్‌గా.. మిగిలిన ముగ్గురు బీఏ చేసి సౌదీ అరేబియాలో కొద్దికాలం పనిచేశారు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చారు.
Four friends religious tolerance Karnataka
పాలు, పట్టు పరిశ్రమపై వీరికి అవగాహన ఉంది. దీంతో భారత్‌కు వచ్చిన తర్వాత ఈ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. దీంతో తమ ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. రూ.20 లక్షలు పెట్టుబడిగా పెట్టి.. పట్టు వ్యవసాయం ప్రారంభించారు. కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తల నుంచి తమకు కావాల్సిన సలహాలు సూచనలు స్వీకరించారు. ప్రస్తుతం విజయవంతంగా పట్టును పండిస్తున్నారు. ఏటా ఏడు విడతలుగా 1200-1500 పట్టుపురుగులను ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా గణనీయంగా లాభాలను వెనకేసుకుంటున్నారు.
పండగలు, ఇతర సెలవులు వచ్చాయంటే వీరంతా ఒకేచోటికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. రంజాన్ మాసంలో నలుగురు కలిసి ఉపవాస దీక్షలు చేస్తారు. ఈస్టర్ సమయంలోనూ కలిసే పండగ జరుపుకొంటారు. ఓనమ్నూ ఘనంగా నిర్వహించుకుంటారు.
మతాచారాల విషయంలోనే కాదు రాజకీయ భావజాలంలోనూ ఈ నలుగురిదీ వేర్వేరు భావనలే. ఒకరు పూర్తిగా కమ్యునిస్టు పార్టీకి మద్దతిస్తే.. మరొకరు భాజపా పక్షాన నిలబడతారు. మిగిలిన ఇద్దరిది కాంగ్రెస్ భావజాలం. ఇలా.. ఒక్కొక్కరిది ఒక్కోదారి. అయినా, వ్యవసాయం తమను ఒక్కచోటికి చేర్చుతోందని నలుగురూ ఆనందంగా చెప్పుకుంటారు.
"నిజానికి మాది కేరళ. ఇక్కడ కర్ణాటకలో పట్టు పెంపకం చేపడుతున్నాం. మేం నలుగురం మత, కుల, రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా కలిసి నివసిస్తున్నాం.. కలిసి పనిచేసుకుంటున్నాం. దేశ, సమాజ సమగ్రతకు అద్దం పట్టే విధంగా కలిసి ఉంటున్నాం."
-జోజి, నలుగురు స్నేహితులలో ఒకరు
నలుగురు స్నేహితులు రెండు బృందాలుగా విడిపోయి పట్టుపెంపకం చేపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నలుగురిని తమకు సహాయంగా పనిలో పెట్టుకున్నారు. ఇద్దరు స్థానిక యువకులకూ ఉపాధి కల్పించారు. యజమాని-కూలీ అన్న తేడా లేకుండా యువకులతోనూ స్నేహితులు కలిసిమెలసి ఉంటారు. అప్పుడప్పుడూ ఆటలు ఆడుతుంటారు.
ఇదీ చదవండి: