ప్రస్తుత కాలంలో ఆన్లైన్ యాప్‌లు, సోషల్ మీడియా ద్వారా చాలా మంది తమ డబ్బులను పోగొట్టుకోవడాన్ని చూస్తున్నాం. అయితే.. కర్ణాటకలో కొత్త రకం మోసం వెలుగుచూసింది. కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని బెదిరించి.. ఓ వ్యక్తి నుంచి రూ. 3.33 లక్షలు కాజేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్(62) ప్రస్తుతం.. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ మండలం అరగ గ్రామంలో నివసిస్తున్నాడు. అక్టోబర్ 16న ఒక తెలియని నంబర్ నుంచి 'మీరు విద్యుత్ బిల్లు కట్టలేదు.. ఈ రోజు రాత్రి 10.30 గంటలలోపు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తాం. వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేసి విద్యుత్ శాఖ అధికారితో మాట్లాడండి' అని ఓ ఫోన్ నంబర్‌తో కూడిన సందేశం వచ్చింది. దాన్ని నమ్మిన రాజ్ కుమార్ మోసగాళ్లు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. తరువాతం వారు చెప్పిన విధంగా తన ఫోన్లో 'టీమ్ వ్యూవర్' అనే యాప్ డౌన్లోడ్ చేశాడు. తరువాత వాట్సాప్ వీడియో కాల్లో డెబిట్, క్రెడిట్ కార్టులను చూపించాలని కోరగా.. బాధితుడు అలానే చేశాడు.
వీడియో కాల్ పూర్తయిన కొద్దిసేపటికే.. రాజ్ కుమార్ ఎస్బీఐ డెబిట్ కార్డు నుంచి రూ.14,165.. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు నుంచి రూ. 99,109.. క్రెడిట్ కార్డు నుంచి రూ.2,19,985 సొమ్మును మోసగాళ్లు కాజేశారు. డబ్బులు పోగొట్టుకున్న రాజ్ కుమార్ ఈ విషయంపై సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లకు వచ్చే మెసేజ్‌లను చూసి మోసపోవద్దని.. అలా సందేశాలు వస్తే 1930 నంబర్‌కు సంప్రదించాలని సీఈఎన్ పోలీస్ అధికారి ఆనంద మూర్తి సూచించారు.