కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) చీఫ్ డీకే శివకుమార్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యకర్తపై చెయ్యి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు శివకుమార్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
మీడియా కథనాల ప్రకారం.. శివకుమార్ మండ్య పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ మాజీ మంత్రి, సీనియర్ నేత జీ మాదెగౌడను పరామర్శించేందుకు శివకుమార్ అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో ఓ కార్యకర్త శివకుమార్ పక్కనే నడుస్తున్నాడు. తర్వాత భుజం మీద చెయ్యి వేసేందుకు ప్రయత్నించాడు. దీంతో కోపోద్రికుడైన శివకుమార్.. రెప్పపాటులో కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. మంచిగా ప్రవర్తించాలని హితవు పలికారు.
కారణమిదే!
భౌతికదూరం పాటించకుండా దగ్గరకు వచ్చినందుకే తాను సమ్యమనం కోల్పోయినట్లు శివకుమార్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనను చిత్రీకరించిన వారిని వీడియో డిలీట్ చేయాలని అభ్యర్థించారు. అయితే, దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు శివకుమార్‌కు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు ఆయన ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు.
గతంలోనూ శివకుమార్ ఈ తరహా వివాదాల్లో చిక్కుకున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా బళ్లారిలో ప్రచారం చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా.. అతని చెయ్యిని పక్కకు తోసేశారు. అప్పట్లో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: 'మూడో దశ ముందే వచ్చాం.. భయమెందుకు?'