Karnataka Hijab Row: కర్ణాటక హిజాబ్ వ్యవహారంలో విద్యార్థులపై తొలిసారి కేసు నమోదైంది. శుక్రవారం.. తుమకూరు జిల్లాలో ఎంప్రెస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు 15 నుంచి 20 మంది విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు తమకు అవకాశం కల్పించాలని నిరసన ప్రదర్శన చేసిన విద్యార్థులపై ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో ఏ ఒక్క విద్యార్థిని పేరు ప్రస్తావించకుండా.. ఆందోళనకు దిగిన విద్యార్థినులపై కేసు నమోదు చేశారు. వారు నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లు ప్రిన్సిపాల్ ఆరోపించారు.
విద్యార్థుల పట్ల మెతక వైఖరి ఉండదని హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర గతంలో ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థిని వెనక్కి పంపిన ప్రిన్సిపాల్..
హిజాబ్ వివాదం నేపథ్యంలో సింధూర తిలకం పెట్టుకుని కళాశాలకు వెళ్లిన విద్యార్థిని విజయపుర జిల్లాలోని ఇండి కాలేజీ ప్రిన్సిపాల్ వెనక్కి పంపారు. ఆ విద్యార్థిని గేటు వద్దే అడ్డుకున్న యాజమాన్యం.. ఎలాంటి మతపరమైన చిహ్నాలకు కళాశాలలో అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థి బంధువు.. కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. అయితే పోలీసుల జోక్యంతో విద్యార్థిని లోపలకు అనుమతించారు. శ్రీరామ్ సేన ఫౌండర్ ప్రమోద్ ముతాలిక్.. ఈ చర్యను ఖండించారు. ఇండి కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బెళగావి జిల్లాలోని ఖానాపురాలోని నంద్‌ఘడ్ కళాశాలలో ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కాషాయ వస్త్రాలతో తరగతులకు హాజరయ్యేందుకు వచ్చిన విద్యార్థులను ప్రవేశం నిరాకరించి వెనక్కి పంపారు.
లెక్చరర్ రాజీనామా
హిజాబ్ లేకుండా కళాశాలకు రావాలని యాజమాన్యం ఆదేశించినందుకు.. ఉద్యోగానికి రాజీనామా చేశారు తుమకూరు జైన్ పీయూ కాలేజీ ఆంగ్ల అధ్యాపకురాలు చాందిని. ఆత్మ గౌరవం కోసమే రాజీనామా చేశానంటూ ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇవీ చూడండి:
'దేశంలోని విద్యా సంస్థల్లో ఒకే డ్రెస్‌కోడ్ నిబంధన!'