ఆమె అందరిలా స్కూల్‌కు వెళ్లలేదు. వినూత్నంగా ఆలోచించింది. రోజూ ఏదో కొత్తగా నేర్చుకోవాలనుకుంది. ఏడాదిన్నర పాటు నిర్విరామంగా కృషి చేసి వివిధ భాషలను నేర్చుకొని.. వాటిని రెండు చేతులతో రాసే నైపుణ్యాన్ని సాధించింది. ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా ఇరవై రకాలుగా రాయడం నేర్చుకుంది. దీంతో ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకుంది కర్ణాటకకు చెందిన ఆదిస్వరూప.
ఆదిస్వరూప తల్లిదండ్రులైన గోపాద్కర్, సుమాద్కర్లకు మంగళూరులో స్టడీ సెంటర్ ఉంది. ఆ సెంటర్లోనే స్వరూప చదువుకుంది. తన సమయాన్నంత స్టడీ సెంటర్లోనే గడిపి ఎన్నో కొత్త నైపుణ్యాలకు పదునుపెట్టుకుంది. మొదట్లో రెండు చేతులతో.. పది రకాలుగా రాయడం నేర్చుకున్న ఆదిస్వరూప.. మరింత సాధన చేసి.. రెండు చేతులతో వివిధ భాషలలో ఇరవై రకాలుగా రాయడం నేర్చుకుంది. సవ్య, అపసవ్య దిశలతో పాటు... మిర్రర్ రైటింగ్, డ్యాన్సింగ్ రైటింగ్‌లలో నైపుణ్యం సాధించింది. కన్నడ-ఇంగ్లిష్, మలయాళం-తులు, ఫ్రెంచ్-కొరియన్, హిందీ-ఇంగ్లిష్.. వంటి భాషలను ఒకేసారి రాసి ప్రపంచ రికార్డును సాధించింది.
"టైం పెట్టుకుని మరీ రెండు చేతులతో ఒకేసారి రాయడాన్ని ప్రాక్టీస్ చేశాను. అలా రాసేటప్పుడు సేమ్ హ్యాండ్ రైటింగ్ వస్తుందో లేదో అని చెక్ చేసేదాన్ని. దాని తర్వాత కొవిడ్ టైమ్‌లో ఏదో ఒకటి చేద్దామని నిర్ణయించుకున్నాను. అప్పుడే రెండు చేతులతోనే 10 రకాలుగా రాయడాన్ని ప్రాక్టీస్ చేశాను. అలా సవ్య దిశ, అపసవ్య దిశలో రాయడం మొదలెట్టాను. మొదట్లో కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే రాయగలిగాను. అలా యూనీ డైరెక్షన్లో ఒక నిమిషంలో 45 పదాలను రాయగలిగాను. 2020లో దానికి నాకు ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డు దక్కింది. ఈ ఒక్క రికార్డుతో ఆగిపోవాలనుకోలేదు. 10 స్టైల్స్‌లో రాసే నేను ఆ తర్వాత 20 రకాలుగా రాయడాన్ని ప్రాక్టీస్ చేశాను. తులు, హిందీ, మలయాళంలోనే కాకుండా విదేశీ భాషల్లోనూ రాయడం నేర్చుకున్నాను. ఫ్రెంచ్, కొరియన్‌ను రాయడం నేర్చుకున్నాను."
-ఆదిస్వరూప
ఆదిస్వరూప గతంలో రూబిక్స్ క్యూబ్ మొజాయిక్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. రెండు చేతులతో నిమిషంలో 45 పదాలను రాసినందుకు మరో వరల్డ్ రికార్డ్‌ను తన సొంతం చేసుకుంది. ఒక్క నిమిషంలో 188 మిర్రర్ ఇమేజ్ పదాలు రాసి మరో రికార్డ్ సాధించింది. స్కూల్‌కు వెళ్లకపోయినా చదువులో మెరుగ్గానే ఉంది ఆదిస్వరూప. స్టడీ సెంటర్లో ఉంటూనే విజువల్ ఆర్ట్స్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం ఓపెన్ స్కూల్లో సెకండరీ పీయూసీ చదువుతోంది.