Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గరపడడం వల్ల అధికార బీజేపీ వేగం పెంచింది. ఈ తరుణంలోనే శనివారం 26 కిలోమీటర్ల మెగా రోడ్ షో చేపట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాజాగా ఆదివారం 8 కిలోమీటర్ల మేర మరో రోడ్ షో చేపట్టారు ప్రధాని మోదీ. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్ షో 11.30 గంటలకు ముగిసింది. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు సాగింది. ఈ క్రమంలోనే వాహనదారులు వేరొక మార్గాన్ని ఎంచుకోవాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రధానికి దారి వెంట పూల వర్షం కురిపించారు. నీట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందిలేకుండా రెండో రోడ్‌షోను 8 కిలోమీటర్లతో సరిపెట్టనున్నారు.
రోడ్ షో ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. శివమొగ్గకు వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు. ఈ సభకోసం భారీగా ఏర్పాట్లు చేసింది బీజేపీ. ఈ సభకు సుమారు 10 నియోజకవర్గాల ఓటర్లు హాజరు కానున్నారు. సమావేశం తర్వాత మైసూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మరో సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత నంజన్గుడ్లోని సుబ్రమణ్య స్వామి, గణపతి ఆలయాలను సందర్శించి.. దిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు.
అంతకుముందు శనివారం 26.5 కిలోమీటర్ల మేర మెగా రోడ్ షోను చేపట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్ షో మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగింది. సోమేశ్వర్ భవన్ నుంచి బెంగళూరు సౌత్‌లోని మల్లేశ్వర్ సంకి ట్యాంక్ వరకు దాదాపు 26.5 కిలోమీటర్లు పర్యటించారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని 34 రోడ్లను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసివేశారు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలను కలుసుకునేందుకు రెండు రోజుల రోడ్ షో పెట్టారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒక రోజులో నగరమంతా పర్యటిస్తే.. ప్రజలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. నగరంలోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని బీజేపీ ఎలక్షన్ నిర్వహణ కమిటీ కన్వీనర్ శోభా కరంద్లాజే చెప్పారు.
Karnataka Election Date : కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 114 సీట్లతో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కు 76, జేడీఎస్‌కు 26 సీట్లు ఉండగా.. 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఇవీ చదవండి : మోదీ రోడ్‌షోతో ట్రాఫిక్ జామ్.. రహదార్లపై చిక్కుకున్న అంబులెన్సులు
ఎన్నికల వేళ ఖర్గేకు షాక్.. రూ. 100 కోట్లు కట్టాలంటూ VHP లీగల్ నోటీసులు..