కర్ణాటకలో కలుషిత నీరు తాగి మరణించిన వారి సంఖ్య ఆరుకి పెరిగింది. విజయనగర జిల్లా మకరబ్బి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామంలోని 150 మందికిపైగా ప్రజలు కలుషిత నీరు తాగి.. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబర్ 23న వీరందరూ ఆస్పత్రిలో చేరగా.. ఇప్పటివరకూ చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. వీరంతా స్వల్ప వ్యవధిలో మరణించడం వల్ల గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
కలుషిత నీరు తాగి మరణాలు సంభవిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు.. నీటి నమూనాలను పరీక్షలకు పంపించారు. గ్రామంలో అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. గ్రామానికి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కలుషిత నీరు తాగి ప్రజలు మరణించడంపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.
ఇదీ చూడండి: కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి- 200 మందికి అస్వస్థత