Cow swallows gold chain: కర్ణాటకలో అనూహ్య ఘటన జరిగింది. ఓ ఆవు బంగారు గొలుసును మింగేయగా.. శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీశారు. హీపనహళ్లికి చెందిన శ్రీకాంత్ హెగ్డే అనే రైతు దీపావళి పండగ రోజున ఇంట్లో గోపూజ నిర్వహించాడు. ఓ ఆవు, దూడను శుభ్రంగా కడిగి వాటికి పూల దండలు, బంగారు గొలుసులు వేసి ముస్తాబు చేశారు. ఆవు మెడలో 20 గ్రాముల బంగారు గొలుసు తొడిగారు. పూజ అనంతరం అలంకారాలను తొలగిస్తుండగా ఆ 20 గ్రాముల గొలుసు కనిపించలేదు. దీంతో దాని కోసం ఇళ్లంతా వెతికారు. గోశాలలో వెతికినా దొరకలేదు.
Gold chain cow stomach: అయితే, ఆ గొలుసును ఆవు మింగేసి ఉంటుందని అనుమానించిన కుటుంబసభ్యులు కొద్దిరోజులపాటు ప్రతిరోజు ఆ ఆవు పేడలో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో చివరి ప్రయత్నంగా.. ఓ పశువైద్యుడిని ఆశ్రయించారు. కాగా మెటల్ డిటెక్టర్‌ను ఉపయోగించి ఆ గొలుసు ఆవు పొట్టలోనే ఉందని డాక్టర్ నిర్ధరించారు. కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు.. ఆ గోవుకు పలుమార్లు స్కానింగ్ చేసి శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యుడు తెలిపారు.
ఇదీ చూడండి: స్టేషన్ గోడలపై గుట్కా మరకలు.. నలుగురు పోలీసులపై వేటు