కర్ణాటకలో ఓ హెడ్ కానిస్టేబుల్ చేతివాటం చూపించాడు. బెంగళూరులో జప్తు చేసిన రూ.50 లక్షల్లో.. రూ.10 లక్షలు కాజేశాడు. ఈ క్రమంలో అతడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. చంద్రా లేఅవుట్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే మహేంద్ర గౌడను నిందితుడిగా గుర్తించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న సమయంలో మహేంద్ర ఈ సొమ్మును కాజేశాడని పోలీసులు తెలిపారు.
చెన్నపట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ లింగేశ్ కారులో రూ.50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ మహేంద్ర. అయితే అతనిని బెదిరించి అందులో నుంచి రూ.10 లక్షలు తన వద్ద ఉంచుకుని.. రూ.40 లక్షలే సోదాల్లో లభ్యమైనట్లు పోలీసు రికార్డుల్లో రాశాడు. అయితే ఈ విషయంపై పోలీసులకు లింగేశ్ ఫిర్యాదు చేయడం వల్ల మహేంద్ర గౌడ బాగోతం బయటపడింది.
"రెండు వేల నోట్లు రద్దు అవుతాయని నా స్నేహితుడు దినేశ్ చెప్పాడు. తన వద్ద ఉన్న రూ.50 లక్షల.. రెండు వేల రూపాయల నోటుల్ని 500 నోట్లుగా మార్చితే 10 శాతం కమిషన్ ఇస్తానన్నాడు. అందుకే బెంగళూరు యూనివర్సిటీలోని జననాభారతి క్యాంపస్‌కు కారులో వచ్చా. పోలీసులు సోదాలు నిర్వహించి నా కారులో ఉన్న ధనాన్ని జప్తు చేశారు. అందులో నుంచి రూ.10 లక్షల మహేంద్ర గౌడ అనే హెడ్ కానిస్టేబుల్ కాజేశాడు."
-లింగేశ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్
హెడ్ కానిస్టేబుల్ మహేంద్ర గౌడ.. లింగేశ్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరెన్సీ నోట్ల మార్పిడిపై సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: ములాయం ఆరోగ్యం మరింత విషమం.. ఐసీయూలో చికిత్స
దిల్లీలో దంచికొడుతున్న వాన.. దశాబ్దంలోనే రికార్డు స్థాయి వర్షపాతం