కోతులు పగబడతాయని ఎప్పుడైనా విన్నారా? కర్ణాటకలో ఓ ఆటోడ్రైవర్ మాత్రం ఇది నిజమని చెబుతున్నాడు. ఓ వానరాన్ని చూస్తేనే(karnataka monkey news) గజగజా వణికిపోతున్నాడు. తనపై ప్రతీకారం(monkey revenge) తీర్చుకునేందుకు అది 22 కిలోమీటర్లు ప్రయాణించి అడవి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయే విషయాలను వెల్లడించాడు. ఈ కోతి ప్రతీకార కథ తెలిస్తే మీరు కూడా అవాక్కవుతారు.
![Monkey Revenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13160508_01.jpg)
కర్ణాటక(karnataka latest news) చిక్కమగళూరు జిల్లా(chikkamagaluru news) కొట్టిగహార గ్రామంలో ఓ కోతి(monkey revenge news) ఇటీవల బీభత్సం సృష్టించింది. ఐదేళ్ల వయసున్న ఈ బానెట్ మెకాక్యూ జాతి మగ వానరం.. స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రజల చేతిలో కన్పించిన ఆహార పదార్థాలను టక్కున లాక్కొని వెళ్లడం, వస్తువులను ఎత్తుకెళ్లడం వంటి చేష్టలతో హడలెత్తించింది. సరే కోతి సహజగుణం అంతే కదా అని వారు సర్దుకుపోయారు. దాని కదలికలు గమనిస్తూ కొన్ని రోజులు జాగ్రత్తపడ్డారు. అయితే పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాక ఈ వానరం ఇంకా చెలరేగిపోయింది. మొరార్జీ దేశాయ్ స్కూల్ ఆవరణలో ఉంటూ పిల్లల వస్తువులు ఎత్తుకెళ్లడం, వారిపై దాడులు చేయడం వంటి చేష్టలతో భయభ్రాంతులకు గురిచేసింది.
![Monkey Revenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13160508_07.jpg)
దీంతో ఈ కోతిని(karnataka monkey) పట్టుకునేందుకు సెప్టెంబర్ 16న అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. దాన్ని బంధించేందుకు అక్కడి ఆటోడ్రైవర్లు, స్థానికుల సాయం కోరారు. ఈ క్రమంలో ఆటోవాలా జగదీశ్.. వారికి తనవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చాడు. వానరాన్ని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది వలపన్నారు. దాన్ని అదే మార్గంలో తీసుకురావాలనే ఉద్దేశంతో జగదీశ్ కోతిని వెక్కిరించాడు. దీంతో అది చిర్రెత్తిపోయింది. అతడిపై దాడి చేసి కరిచింది. వెంటనే హడలిపోయిన జగదీశ్.. పారిపోయి ఆటోలో దాక్కున్నాడు. అయినా వానరం అతడిని వదలకుండా వెంబడించింది. ఆటోలోకి చొరబడి సీట్లు చింపేసింది. చివరకు ఎలాగోలా అటవీశాఖ సిబ్బంది 30 మంది సాయంతో మూడు గంటల పాటు శ్రమించి ఆ కోతిని బంధించారు. అనంతరం దాన్ని తీసుకెళ్లి 22కి.మీ దూరంలో ఉన్న బలూర్ అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. హమ్మయ్య అనుకుని జగదీశ్ ఊపిరి పీల్చుకున్నాడు.
![Monkey Revenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13160508_03.jpg)
" నేను ఆ రోజు నరకం అనుభవించాను. నేను ఎక్కడకు వెళ్లినా ఆ కోతి వెంబడించింది. నన్ను గట్టిగా కరిచింది. ఆ గాయాలు మానడానికి కనీసం 30 రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. నాకు బతుకుదెరువైన ఆటోను నడపలేకపోయాను. ఆ రోజు కోతి అనుసరిస్తుందేమోననే భయంతో నేను ఇంటికి కూడా వెళ్లలేదు. నాకు చిన్న పిల్లలున్నారు. వారిపై కోతి దాడి చేస్తే ఏంటి పరిస్థితి? నాకు ఇంకా భయంగానే ఉంది."
--జగదీశ్, ఆటోవాలా.
అయితే ఈ కోతి కథ ఇక్కడితో ఆగిపోలేదు. వానరం నుంచి తమకు విముక్తి లభించిందని గ్రామస్థులతో పాటు జగదీశ్ భావించిన వారం రోజుల్లోనే అది మళ్లీ ప్రత్యక్షమైంది. అటవీప్రాంతంలోని రోడ్డు నుంచి వస్తున్న ఓ ట్రక్కు ఎక్కి అది తిరిగి గ్రామానికి వచ్చింది. ఆ కోతిని చూసిన గ్రామస్థులు విషయాన్ని జగదీశ్‌కు చెప్పారు. దీంతో అతని గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. వెంటనే ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అటవీశాఖ సిబ్బంది తక్షణమే రావాలని సమాచారమిచ్చాడు.
రంగంలోకి దిగిన సిబ్బంది ఆ కోతిని ఈనెల 22న మళ్లీ పట్టుకున్నారు. ఈ సారి బలూర్ అటవీ ప్రాంతంలో కాకుండా ఇంకా సుదూర ప్రాంతంలో విడిచిపెట్టారు.
![Monkey Revenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13160508_06.jpg)
"కోతి మళ్లీ వచ్చిందని గ్రామస్థులు చెప్పగానే నా వెన్నులో వణుకుపుట్టింది. దాని చెవిపై ఉన్న మచ్చ చూసి అదే అని గుర్తుపట్టాం." అని జగదీశ్ వాపోయాడు. అది మళ్లీ వస్తుందేమోనని అందోళనగా ఉందని చెప్పాడు. ఎందుకైనా మంచిది.. ఇంకా కొద్ది రోజులు ఇంట్లోనే ఉంటానని తెలిపాడు.
![Monkey Revenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13160508_05.jpg)
అయితే కోతి అతడిపై ఎందుకు పగబట్టిందో అర్థంకావడం లేదని అటవీశాఖ సిబ్బంది చెప్పారు. అతడు దానికి ఏమైనా హాని చేసాడో? లేదో? తమకు తెలియదన్నారు. కానీ వానరాలు ఇలా ప్రవర్తించడం తొలిసారిగా చూస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: 9 నెలల పసికందును చంపి.. గొంతు కోసుకున్న తండ్రి!