కర్ణాటక ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వివిధ స్థానాలకు పోటీ చేసే 189 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపింది. మొత్తం 189 మందిలో 52 మంది అభ్యర్థులు కొత్తవారేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. 8 సీట్లను మహిళలకు కేటాయించినట్లు అరుణ్ సింగ్ తెలిపారు.
బీజేపీ విడుదల చేసిన జాబితా ప్రకారం.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర.. తన తండ్రి స్థానమైన శికారీపుర నుంచి పోటీ చేయనున్నారు. రాష్ట్ర మంత్రి, మరో సీనియర్ నేత బీ శ్రీరాములు బళ్లారి గ్రామీణం నుంచి పోటీ పడనున్నారు. చిక్కబళ్లాపుర నుంచి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్, మల్లేశ్వరం నుంచి మంత్రి అశ్వత్నారాయణ్ బరిలోకి దిగనున్నారు.
కాంగ్రెస్ నేతలకు పోటీగా మంత్రులు..
మంత్రి ఆర్ అశోక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ వెల్లడించింది. పద్మనాభనగర్, కనకాపుర నుంచి ఆయనను బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది. కనకాపురలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో అశోక తలపడనున్నారు. మంత్రి వీ సోమన్న సైతం రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య బరిలో ఉన్న వరుణ స్థానంలో బీజేపీ తరఫున సోమన్న తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్కమగళూరు నుంచి పోటీ చేయనున్నారు.
- సామాజిక వర్గాలవారీగా సీట్ల కేటాయింపు ఇలా..
- ఓబీసీ అభ్యర్థులు- 32
- ఎస్సీ అభ్యర్థులు- 32
- ఎస్టీ అభ్యర్థులు- 16
తొలి జాబితాలో స్థానం దక్కించుకున్నవారిలో తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు. ఐదుగురు న్యాయవాదులు, ముగ్గురు విద్యావేత్తలు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ముగ్గురు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఎనిమిది మంది సామాజిక కార్యకర్తలు బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే అభ్యర్థుల ఎంపిక చేపట్టామని కర్ణాటక ఎన్నికలకు బీజేపీ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వీరి ద్వారా కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయి.. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా.. పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని వర్గాల సలహాలు తీసుకొని ఈ జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏప్రిల్ 13 నుంచి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల సమర్పణకు ఏప్రిల్ 20 చివరి తేదీ.