కర్ణాటక చామరాజనగర్‌కు చెందిన పొన్నాచి మహదేవ స్వామి.. చేతి గడియారాలంటే అమితంగా ఇష్టపడతారు. వృత్తిపరంగా ఉపాధ్యాయుడైన ఆయన.. వాచ్‌లపై అభిమానంతో హోరాలజిస్ట్(గడియారాల సేకరించే వారు) అయ్యారు. యుక్త వయసు నుంచే హెచ్ఎంటీ బ్రాండ్‌ను అమితంగా ఇష్టపడే ఆయన.. ఆ అభిరుచితో ఇప్పటివరకు 400 హెచ్ఎంటీ వాచ్‌లను సేకరించారు.
400కుపైగా వాచ్‌లతో..
హనూర్ తాలుకా ప్రాంతానికి చెందిన మహదేవస్వామి.. యలందూర్లోని ఓ పాఠశాలలో రిసోర్స్ విభాగంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. చేతి గడియారాలపై ప్రేమతో.. కొన్నేళ్లుగా పలు షోరూమ్‌లు, దుకాణాలు, ఆన్లైన్ షాపింగ్ సైట్లను సంప్రదించారట. అలా ఇప్పటివరకు ఒకే బ్రాండ్(హెచ్ఎంటీ)కు చెందిన 400 రకాల వాచ్‌లను సేకరించానంటున్నారు మహదేవ స్వామి.
"నేను ఎస్ఎస్ఎల్సీ(పదో తరగతి) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. మా నాన్న నాకు హెచ్ఎంటీ వాచ్ ఇస్తానని చెప్పారు. దురదృష్టవశాత్తూ నేను పాస్ కాలేదు. దాంతో వాచ్ దూరమైంది. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత నేనే సొంతంగా ఒక హెచ్ఎంటీ గడియారాన్ని కొన్నాను. అలా.. క్రమంగా ఈ బ్రాండ్‌పై ఆసక్తి పెరిగింది. అదే అభిరుచితో ఇప్పటివరకు సుమారు 400కుపైగా హెచ్ఎంటీ వాచ్‌లను సేకరించారు."
- మహదేవ స్వామి
మహదేవ స్వామి పోగు చేసిన వాచ్‌లలో.. హెచ్ఎంటీ బ్రాండ్‌తో పాటు ఇతర కంపెనీల వాచ్‌లూ చాలానే ఉన్నాయట. పురుషులకు సంబంధించి జనతా, కొహినూర్, కాంచన్, చాణక్య వంటివి చాలా ఉన్నాయి. మహిళకు చెందిన కావేరీ, గోదావరి, గంగా, తారా వంటివెన్నో కనిపిస్తున్నాయి.
లాక్డౌన్లో రిపేరింగ్ నేర్చుకొని..
తాను పోగు చేసిన గడియారాల్లో కొన్ని సరైన సమయం చూపించక పోవడం, రిపేర్‌కు రావడం వంటివి గమనించాడు మహదేవ స్వామి. దీన్ని అధిగమించేందుకు కలిసొచ్చిన లాక్డౌన్ కాలాన్ని ఉపయోగించుకుని యూట్యూబ్ వీడియోలను చూసి రిపేరింగ్ చేయడం కూడా నేర్చుకున్నారు. అలా వాచ్ మెకానిక్‌గానూ పేరుపొందారాయన.
గడియారాల సేకరణలో వార్తల్లో నిలిచిన మహదేవస్వామిని.. గతేడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం విశేషం.
ఇదీ చదవండి: 'హైఫై మాస్క్ వ్యాక్సిన్‌లా పనిచేస్తుంది'