తండ్రి మరణం ఆ యువతిని నాగలి పట్టేలా చేసింది. పురుషులకే సొంతం అనుకునే సాగు పనులను సులువుగా చేస్తూ తన కుటుంబానికి పెద్దదిక్కుగా నిలుస్తోంది. ఆమే.. కర్ణాటక రాయ్‌చూర్ జిల్లా జక్కల్దిన్ని గ్రామానికి చెందిన హులికమ్మ.
ట్రాక్టర్ ఎక్కి...
హులికమ్మ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తండ్రి మరణించాడు. దాంతో ఆమె తన చదువుకు స్వస్తి చెప్పి వ్యవసాయ భూమిలోకి అడుగు పెట్టింది. సేద్యం పనులను హులికమ్మ పూర్తిగా నేర్చుకుంది. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నడం వంటి కష్టమైన పనులను కూడా ఆమె చేస్తోంది.
వైద్యం భారం..
హులికమ్మ తండ్రి రెండేళ్ల క్రితం పక్షవాతం బారిన పడ్డాడు. ఆయన వైద్యం కోసం ఎంతగానో ఖర్చు చేశారు. అయినప్పటికీ ఆయన్ను ఆ కుటుంబం బతికించుకోలేకపోయింది. ఆయన వైద్యానికి అయిన ఖర్చుతో హులికమ్మ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హులికమ్మ చదువును మధ్యలోనే ఆపేసి కుటుంబాన్ని పోషించే భారం తన భుజాలపై ఎత్తుకుంది. ఆమె తను రెక్కల కష్టంతో తన మరో సోదరిని చదివిస్తోంది. హులికమ్మకు తన తల్లి కూడా ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది.
"రైతు కుమార్తెగా నేను పుట్టాను. మా కుటుంబం ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో నేను వ్యవసాయం చేయక తప్పలేదు. దాంతో పాటు మా నాన్నకు తన కూతుళ్లను మంచిగా చదివించాలి కోరిక ఉండేది. వ్యవసాయంతో పాటు నేను నా చదువును కొనసాగిస్తాను."
-హులికమ్మ, యువరైతు.
తమకున్న మూడు ఎకరాల భూమికి అదనంగా మరో 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది హులికమ్మ. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆమె ఆ భూమిలో కొత్త పంట వేస్తోంది.
ఇదీ చూడండి: తల్లి మృతదేహంతో ఇంట్లో ఐదు రోజులుగా...
ఇదీ చూడండి: ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి పెళ్లి- ఇంట్లో తెలియగానే...