Bihar Family News: ఈరోజుల్లో ఒక ఇంట్లో ఐదారుగురు సభ్యులు ఉంటేనే ఎన్నో సమస్యలు, మనస్పర్థలు వస్తుంటాయి. కుటుంబ నిర్వహణ కూడా భారంగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ బిహార్‌లో మాత్రం ఓ ఉమ్మడి కుటుంబం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒకే ఇంట్లో ఏకంగా 62 మంది కలసిమెలసి అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఎలాంటి గొడవలు, సమస్యలు లేకాండా హాయిగా ఉంటున్నారు.
Biggest family in india: బిహార్ బోధ్‌గయాకు చెందిన ఈ ఫ్యామీలిని కల్యాణ్ కుటుంబం అని పిలుస్తారు. కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి ఈ ఇంటికి పెద్దలు. ఈ కుటుంబం విడిపోకుండా వీరే చూసుకుంటున్నారు. మొత్తం 62 మంది ఉండే ఈ ఇంట్లో 57 గదులుంటాయి. దాదాపు అందరికీ ప్రత్యేక రూమ్‌లు ఉన్నాయి. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కల్యాణ్ పరివార్ కాంప్లెక్స్ అంటారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇంత మందికి కలిపి ఒకే కిచెన్ ఉంటుంది. అందరూ ఒకేసారి భోజనం చేస్తారు.
Gaya Kalyan Family: ఈ ఫ్యామిలీలో 9 మంది అన్నదమ్ములు ఉన్నారు. వారిలో అజయ్ సింగ్ కల్యాణ్ పెద్ద. ఈ కుటుంబం కలసి ఉండటానికి తమ దివంగత.. అంకుల్, ఆంటీలు రామ్లఖాన్ సింగ్, గంగాదేవీనే కారణమని అజయ్ చెప్పారు. వారి మరణం తర్వాత తమ తల్లిదండ్రులు కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి కుటుంబాన్ని చూసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ అంకుల్ లాగే తండ్రికి కూడా ఉమ్మడి కుటుంబమంటేనే ఇష్టమని, అందుకే ఇప్పటివరకు కుటుంబం నుంచి ఎవరూ విడిపోలేదని వివరించారు.
ఈ కుటుంబంలో మొత్తం ఆరు తరాలు ఉండగా.. ప్రస్తుతం నాలుగు తరాల వారు ఈ ఇంట్లో ఉన్నారు. అందరికంటే పెద్ద కృష్ణ కన్నయ్య ప్రసాద్. పదేళ్ల చమి కల్యాణ్ అనే పాప అతి చిన్న వయస్కురాలు. తమ కుటుంబంలో కజిన్స్‌తో కలిపి మొత్తం 9 మంది అన్నదమ్ములని వివేక్ కల్యాణ్ సింగ్ తెలిపారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారని పేర్కొన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయని, ఇంట్లో మొత్తం 21 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించారు.
ఉమ్మడి కుటుంబంగానే కాకుండా ఈ ఫామిలీకి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. ఐదు ఎన్జీఓల సాయంతో ఈ ప్రాంతంలోని పేదలకు సాయం చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లో అనేక మంది ఆసరాగా ఉంటున్నారు. కొంత మంది జీవితంలో స్థిరపడేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. అంతేగాక ఈ ఇంట్లో అన్నాదమ్ములందరికీ ప్రత్యేక వ్యాపారాలున్నాయి. హోటల్స్, హార్డ్‌వేర్, శానిటరీ ఐటెమ్స్, టైల్స్-మార్బుల్స్, భవన నిర్మాణ వస్తువులు, ఎలక్ట్రిక్ వస్తువులు వంటి భిన్న రకాల వ్యాపారాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: శ్రీకృష్ణ జన్మస్థలంలో మసీదును తొలగించాలని పిటిషన్.. కోర్టు ఏమందంటే?