Jyotirlinga Names And Locations In India : పురాణాల ప్రకారం కార్తిక మాసం పరమశివుడికి ప్రీతికరమైనది. ఈ మాసంలో పవిత్ర శైవక్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైనా దర్శించుకోవడం వల్ల ఏడేడు జన్మల్లో చేసిన పాపాలు హరించుకుపోతాయని నమ్మకం. అయితే జ్యోతిర్లింగాలను దర్శించలేని వారు.. "సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్" అని స్తోత్రం పఠిస్తారు. ఇంతకీ ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి..? వాటి విశేషాలు.. ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిర్లింగం అంటే శివుడు లింగ రూపంలో ఉండే చోటు. సామాన్యులు కూడా తనను పూజించేందుకు, ఆరాధించడానికి అణువుగా ఉండేందుకే ఆ పరమేశ్వరుడు ఇలా లింగ రూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి. మన దేశంలో 12 చోట్ల జ్యోతిర్లింగాలను నెలకొల్పారు. మహా శివరాత్రి, కార్తికమాసంలో అక్కడికి వెళ్లే వారు ఎంతో మంది ఉన్నారు. మరి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి..? వాటి విశేషాలు ఏంటో.. తెలుసుకుందాం పదండి..
12 Jyotirlinga Name With Place :
1. సోమనాథేశ్వరం, గుజరాత్..: పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానంలో వున్న సోమనాథక్షేత్రం గుజరాత్‌లో ఉంది. లయకారకుడు జ్యోతిర్లింగ ఆకారంలో భక్తులకు యుగయుగాల నుంచి దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథక్షేత్రంగా పేరొందింది. పురాణాల ప్రకారం.. దక్షప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అయితే చంద్రుడు రోహిణితో మాత్రమే సఖ్యంగా ఉన్నాడని మిగిలిన భార్యలు తమ తండ్రైన దక్షప్రజాపతికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన చంద్రుడు క్షయవ్యాధితో బాధపడాలని శపించాడు. దీంతో భూలోకంపై వచ్చిన చంద్రుడు ప్రస్తుత క్షేత్రమున్న ప్రాంతంలో శివ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాపం నుంచి విముక్తి కలిగించాడు. 27 సతీమణులను సరిసమానంగా చూసుకోవాలని చంద్రునికి హితవు పలికాడు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన ప్రదేశం కాబట్టి సోమనాథక్షేత్రంగా పేరొచ్చింది. అప్పుడు కృతజ్ఞతతో చంద్రుడు ఈశ్వరుడికి సువర్ణ దేవాలయాన్ని కట్టించాడని భక్తులు విశ్వసిస్తారు.
Dwadash Jyotirlinga In Telugu :
2.మల్లికార్జున స్వామి, శ్రీశైలం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న నల్లమల కోనలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ కృష్ణా నది తీరంలోని ఒక శిఖరం మీద నందీశ్వరుడు చేసిన ఘోర తపస్సుకి మెచ్చిన శివుడు.. భ్రమరాంబికాసమేతుడై వెలిశాడనేది ఓ పౌరాణిక గాథ చెబుతోంది. శిలాపాదుడనే రుషి పుత్రుల్లో ఒకడైన శ్రీపర్వతుడు, శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేయగా హరుడు ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. అప్పుడు తాను శిఖర రూపు దాలుస్తాననీ అక్కడ పరమ శివుడు కొలువుండాలనీ కోరడంతో ఆ బోళాశంకరుడు మల్లికార్జునుడిగా కొలువు దీరినట్లు పద్మపురాణం పేర్కొంటోంది. భ్రమరాంబికాదేవి సైతం ఇక్కడ ఉండటంతో ఈ క్షేత్రం శక్తిపీఠంగానూ వెలుగొందుతోంది. వనవాస సమయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలూ, పాండవులు ప్రతిష్ఠించిన ఐదు లింగాలూ శ్రీశైలంలో ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు శివానందలహరిని ఇక్కడే రాశారని చెబుతారు.
3. మహాకాళేశ్వరం, మధ్యప్రదేశ్..
మధ్యప్రదేశ్‌లోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటి చెబుతారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పాలించిన దూషణాసురుడిని సంహరించిన రుద్రుడు ఇక్కడ మహాకాళేశ్వరుడిగా వెలిశాడనేది చెబుతారు. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఉజ్జయిని. ఈ నగరంలో 7 సాగర తీర్థాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా ఉండటం, ఒకసారి పూజించిన బిల్వ పత్రాలతోనే కాళేశ్వరుడిని అర్చించడం, గర్భగుడిలో శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండటం వంటివి ఈ క్షేత్రానికున్న ప్రత్యేకతలుగా చెబుతారు.
4.ఓంకారేశ్వరం, మధ్యప్రదేశ్..
మధ్యప్రదేశ్‌లోని వింధ్య పర్వతల్లో నర్మదానది రెండు పాయలుగా చీలిన చోట.. ఆ పరమేశ్వరుడు వెలసిన క్షేత్రమే ఓంకారేశ్వరంగా చెబుతారు. సుదీర్ఘకాలంపాటు జరిగిన దేవదానవుల యుద్ధంలో దానవులు గెలిచారనీ, అప్పుడు దేవతలు పరమేశ్వరుడిని వేడుకోగా ఓంకారేశ్వరుడుగా వెలసి దానవులని ఓడించి, నర్మదా తీరంలో జ్యోతిర్లింగ రూపంలో కొలువయ్యాడనీ అంటారు.
5.కేదారనాథేశ్వరం, ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్‌కు సమీపంలో కేదారనాథేశ్వరం క్షేత్రం ఉంది. సముద్రమట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో రుద్ర హిమాలయాల్లో మందాకినీ నదీ ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని జ్యోతిర్లింగం ఎద్దు మూపురం ఆకారంలో ఉంటుంది. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. పాండవులు స్వర్గారోహణం చేసింది ఇక్కడి నుంచేననీ ఆ సమయంలో ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారనీ చెబుతారు. ఇక్కడ నేటికీ పాండవులు, ద్రౌపది విగ్రహాలు అంతరాలయంలో ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధినీ, శివపార్వతుల తపోభూమినీ ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.
శివానుగ్రహం పొందాలంటే.. ఇలా చేయండి
6.భీమశంకరం, మహారాష్ట్ర..
మహారాష్ట్రలోని పుణెకు సమీపంలోని భావగిరి గ్రామంలో శివుడు భూతనాథుడుగా కొలువుతీరిన ప్రదేశమే భీమశంకరంగా చెబుతారు. ఇక్కడ ఈశ్వరుడు.. ఢాకినీ, శాకినీ వంటి క్షుద్రశక్తులతో పూజలందుకుంటున్న భయంకరుడుగానూ, అలాగే భక్తులకు శుభాలు కలిగించే భీమశంకరుడుగానూ కొలువై ఉన్నాడు. ఈ జ్యోతిర్లింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది.
7.శ్రీనాగనాథేశ్వర ఆలయం, మహారాష్ట్ర..
మహారాష్ట్రలోని ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. పాండవులు అరణ్య వాసం చేస్తున్నప్పుడు దారుకావనంలో వారే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు శ్రీనాగనాథేశ్వర ఆలయాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.
8. ఘృష్ణేశ్వరం, మహారాష్ట్ర..
మహారాష్ట్రలోని దౌలతాబాద్ సమీపంలో ఉన్న ఘృష్ణేశ్వరం ఆలయం వేరుల్ గ్రామంలో ఉంది. ఇక్కడ ఘృష్ణేశ్వరుణ్ని ఘశ్మేశ్వరుడుగానూ భక్తులు పిలుస్తారు. ఈ నగరాన్ని పూర్వం దేవగిరి అని పిలిచేవారట. సుధర్ముడు, సుదేహ అనే దంపతులకు ఎంతకాలమైనా పిల్లలు పుట్టకపోవడంతో సుదేహ తన చెల్లెలు ఘశ్మను భర్తకిచ్చి వివాహం జరిపిస్తుంది. వారిద్దరికీ బిడ్డ పుట్టిన తరవాత అసూయతో ఆ బాలుడిని ఏటిలో పారేస్తుంది. శివపూజా దురంధరురాలైన ఘశ్మ 101 పార్థివలింగాలను ఆ నీటిలోకి వదిలి, సర్వేశ్వరుడిని పూజించడంతో ఆమె భక్తికి మెచ్చి, కొడుకును బతికించడంతోపాటు, ఆమె కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపంలో ఘృష్ణేశ్వరుడుగా వెలిశాడనీ పురాణాలు చెబుతున్నాయి.
9. వైద్యనాథేశ్వరం, మహారాష్ట్ర..
వైద్యనాథేశ్వరం జోతిర్లింగం పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతిపుర్ దగ్గర శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా భక్తులు పూజిస్తున్నారు. ఈ లింగాన్ని పూజిస్తే సకల వ్యాధులు నయం అవుతాయని భక్తులు నమ్ముతారు.
10.కాశీ విశ్వేశ్వరం, వారణాసి (ఉత్తరప్రదేశ్)..
వారణాసిగా పిలిచే కాశీ క్షేత్రంలో విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉంది. గంగకు ఉపనదులైన వారుణ, అసి సంగమించే చోటు వారణాసి. కాబట్టి, ఈ నగరానికి వారణాసి అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం ఈ నగరంలో దేవతలు నివసించారని నమ్ముతారు. కాశీలో చాలా ఆలయాలూ, స్నానఘట్టాలూ ఉన్నాయి. కాశీనాథుణ్ణి దర్శించుకుంటే మిగిలిన జ్యోతిర్లింగాలన్నింటినీ చూసినంత పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
11. త్రయంబకేశ్వరం, మహారాష్ట్ర..
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్రయంబకేశ్వరం ఆలయం ఉంది. బ్రహ్మవిష్ణువులతో కలిసి పరమశివుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం ఇది. పురాణాల ప్రకారం గౌతమ రుషి తన పంటచేలో మేస్తోన్న గోవుని వధించిన పాపపరిహారం కోసం తపస్సు చేయగా, సర్వేశ్వరుడు ప్రత్యక్షమై గంగను ఆ ప్రాంతంలో ప్రవహించేలా చేయడంతోపాటు త్రయంబకేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడని పురాణాలు పేర్కొంటున్నాయి.
12. రామేశ్వరం, తమిళనాడు..
రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరం పట్టణంలో ఉంది. పురాణాల ప్రకారం.. రావణ వధ తర్వాత శ్రీరామ చంద్రుడు సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివుడి ఆత్మ లింగాన్ని తెమ్మని హనుమను ఆజ్ఞాపిస్తాడు. ఆంజనేయుడు ఎంతకీ రాకపోవడంతో సీతమ్మవారు ఇసుకతో చేసిన లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అది రామేశ్వర లింగం. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న హనుమంతుడు, తాను వచ్చేదాకా ఆగలేదని అలగడంతో రాముడు.. మారుతి తెచ్చిన లింగాన్నీ కూడా ప్రతిష్ఠిస్తాడు. అది విశ్వేశ్వర లింగం. రామేశ్వరంలో హనుమంతుడు తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని పూజించిన తరవాతే భక్తులు రామలింగేశ్వరుణ్ణి పూజించేట్టుగా రాముడు వరమిస్తాడు.
కార్తికమాసం స్పెషల్.. యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం