దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఆగ్రహానికి గురైన బాలీవుడ్ నటి జూహీ చావ్లా తాజాగా ఆ పరిణామాలపై స్పందించారు. తాను ఆ పిటిషన్ ఎందుకు వేశానో చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 5జీ నెట్‌వర్క్‌కు తాను వ్యతిరేకం కాదని, అయితే అది పూర్తిగా సురక్షితమని అధికారులు హామీ ఇవ్వాలని కోరారు.
"కొన్ని రోజులుగా నా పిటిషన్‌పై ఎన్నో విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నాయి. అవన్నీ నేను వినలేకపోతున్నాను. అయితే వాటిలో ఒక ముఖ్యమైన అంశాన్ని విస్మరిస్తున్నాం. మేం 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకం కాదు. నిజానికి మేం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే అది పూర్తిగా భద్రమైనదే అని అధికారులు ధ్రువీకరించాలి. అధ్యయనాలను ప్రచురితం చేయాలి. పరిశోధనలు జరపాలి. ఈ నెట్‌వర్క్ వల్ల పిల్లలకు, గర్భిణీలకు, గర్భంలో ఉన్న శిశువులకు ఎలాంటి హాని ఉండదని హామీ ఇవ్వాలి. అప్పుడే మాకున్న భయాలు తొలగిపోతాయి. అప్పుడే మేం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం."
-జూహీ చావ్లా, నటి, పర్యావరణ కార్యకర్త
5జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా నటి జూహీ, వీరేశ్ మాలిక్, టీనా వచానీ ఇటీవల దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ టెక్నాలజీలో ఉండే రేడియేషన్ వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని, మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం కంటే 10 నుంచి 100 రెట్లు అధిక ప్రభావం పడుతుందని వాదించారు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టిపారేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, కోర్టు విచారణ లింక్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేసినందుకుగానూ పిటిషనర్లకు రూ. 20లక్షల జరిమానా విధించింది.
ఇవీ చూడండి: