BJP state President : బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా సోము వీర్రాజు స్థానంలో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. అధ్యక్షుడిగా పదవీ కాలం ముగియడంలో సోము వీర్రాజును పదవి నుంచి తప్పించారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా సోము వీర్రాజుకు ఫోన్ చేసి చెప్పారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని నడ్డా ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే.. ఈ విషయంపై సోము వీర్రాజు ఇంకా స్పందించలేదు. సోము వీర్రాజు 1978 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అనంతరం 2020 జులై 27న సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2006-2013 వరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సోము వీర్రాజు.. 2013 నుంచి 2018 వరకు బీజేపీ కార్యవర్గంలో ఉన్నారు.
ఏపీ అధ్యక్షుడిని మార్చాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందని గతకొంతకాలంగా ప్రచారంలో ఉంది. దీంతో పాటు రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు సోము వీర్రాజుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు సహా వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఏపీలో మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోము వీర్రాజును తప్పించనట్లు తెలుస్తోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోము వీర్రాజును తొలగిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఆయనకే ఫోన్ చేసి చెప్పి షాక్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజుకు ఫోన్ చేసిన నడ్డా.. "మీ టర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని తప్పిస్తున్నాం.. రాజీనామా చేయాలి"’ అని సూచించినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతా రామరాజు జయంతి నిర్వహించిన కాసేపటికే... సోము వీర్రాజు ఈ షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఏపీలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీలోని కొందరు నేతలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. పైగా.. కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడటానికి కారణం కూడా సోమూ వీర్రాజే అని గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ప్రకటించారు.
శుభాకాంక్షలు తెలిపిన సోము వీర్రాజు.. పార్టీ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన దగ్గుబాటి పురందేశ్వరికి సోము వీర్రాజు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ అధ్యక్షురాలిగా స్వాగతిస్తూ.. పురందేశ్వరి నియామకం రాష్ట్రంలో పార్టీ విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కాగా, బీజేపీ కేంద్ర అధినాయకత్వం పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది.