దేశవ్యాప్తంగా 100 రోజులపాటు పర్యటించేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సన్నాహాలు ప్రారంభించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా నడ్డా యాత్ర సాగనున్నప్పటికీ... ప్రయాణంలో మూడోవంతు సమయం భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లోనే సాగనుందని విశ్వసనీయ సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఎలా విజయం సాధించాలనే విషయాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఎన్డీఏ కూటమి సభ్య పార్టీల నేతలతోనూ ఆయన సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మూడు జాబితాల్లో...
రాజకీయంగా కీలకమైన ఉత్తర్ప్రదేశ్లో అధికంగా 8 రోజుల పాటు పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నడ్డా యాత్ర సందర్భంగా రాష్ట్రాలను 3 విభాగాలుగా పార్టీ విభజించింది. దాని ప్రకారం 'ఏ' జాబితాలో భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలు, 'బి' జాబితాలో భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, 'సి' జాబితాలో చిన్న రాష్ట్రాలు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ఉంటాయి. నడ్డా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని భాజపా నేతలకు పార్టీ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నేపథ్యంలో ఏ సమావేశ మందిరంలోనూ 200 మందికి మించి ప్రజలు ఉండొద్దని పార్టీ వర్గాలు సూచించాయి. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో నడ్డా సమావేశం కానున్నట్లు తెలిపాయి. ఈ సందర్భంగా బహిరంగ, విలేకరుల సమావేశాల్లో ఆయన పాల్గొననున్నట్లు స్పష్టం చేశాయి.
ఇదీ చూడండి: కేంద్ర కేబినెట్లోకి సుశీల్ మోదీ, సింధియా!